హిమాయత్ సాగర్ జలాశయం గేట్లు ఎప్పుడైనా తెరిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను, ఇళ్ళు ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటర్ బోర్డ్ హెచ్చరికలు జారీ చేసింది. కొద్ది సేపటి క్రితం హిమాయత్ సాగర్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ , జలమండలి అధికారులు పరిశీలించారు.
రాత్రి నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షానికి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పిల్లోనిగుడా, ననాజీపూర్, వెంకటాపూర్, అమడపూర్ , వాగులతో పాటు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి చెరువు, కాముని చెరువు నిండులకుండలా మారి ఆ నీరు అంతా హిమాయత్ సాగర్ లోకి వచ్చి చేరుతోంది. ఇంకో 7 అడుగుల నీరు వస్తే గేట్లు ఓపెన్ చేసే అవకాశముంది. ఎఫ్ టి ఎల్ 1765 కాగా ప్రస్తుతం 1759 అడుగులకు చేరింది నీటి మట్టం. పరిస్థితిని ఎప్పటికప్పుడు రెవెన్యూ, జలమండలి అధికారులు సమీక్షిస్తున్నారు. చివరగా 2010లో సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.