శివ.. అంటే చాలు సర్వమంగళాలు సంభవిస్తాయి. ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రమేకాకుండా పురాణకాలంనాటి పవిత్ర క్షేత్రంలో భక్తులు కోరుకున్నకోర్కెలు తీర్చే అద్భుత దేవాలయం ఆ విశేషాలు తెలుసుకుందాం…. పంచారామాల్లో ఒకటి. ద్రాక్షారామం. ఆ క్షేత్రనికి సంబంధించిన పురాణగాథ తెలుసుకుందాం.. తారకాసురుని మెడలోని శివ లింగాన్ని కుమారస్వామి ఛేదించగా ఐదు చోట్ల పడ్డ ఆ లింగం ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారని చెప్పుకున్నాము కదా. అందులో ఒక ముక్క ఇక్కడ పడింది. ఇది వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠిత లింగం. పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే దాక్షారామం అయింది. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కానీ, తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. కారణం అంతకు ముందెప్పుడో ఈయనగారిని చూసి ఆయన పలకరించలేదనీ, అభివాదం చేయలేదని కోపం వచ్చింది. ఈ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలిసింది. పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది, ఆసంబరం, ఆ హడావిడి తను మిస్ అయిపోతోందే అనుకుంది. శివుడి దగ్గర పుట్టింటి వెళ్తానని అడిగింది.
కానీ శివుడు జగదీశ్వరుడు కదా. ఆయన పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, వద్దు అని చెప్పాడు. కానీ సతీదేవి పరమేశ్వరుడిని ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఎవరూ ఆవిడని పలకరించలేదు. ప్రేమాదరాలు చూపించలేదు. దానితో పార్వతీదేవికి కోపం వచ్చింది. భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాప పడింది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకెళ్ళి జరిగిన విషయం చెప్పలేక పోయింది. ఆ అవమానం భరించలేక తనని తను కాల్చుకుని బూడిద అయింది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటంనుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.
పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి సూక్ష్మ శరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు. శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీ దేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు. ఆ శరీరం 18 ముక్కలయి 18 చోట్ల పడ్డాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలు. వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పున ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీ చక్రాలను కూడా స్ధాపించారు. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు.
వ్యాస పురాణగాథ !
ఇంకొక్క కధ మాత్రమే చెప్తానండీ ఈ క్షేత్రం గురించి. పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు. ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి ఎక్కడా భిక్ష దొరక్కుండా చేశాడుట. దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడుట. అప్పుడ అన్నపూర్ణాదేవి ఆయనకీ, శిష్యులకీ భిక్ష పెట్టిందట. వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోవం తెప్పించింది. వెంటనే శివుడు వేదవ్యాసుణ్ణి శిష్యసమేతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి ఆయనకు దక్షారామము పోయి అక్కడ భీమేశ్వరుని సేవించమనీ, అక్కడ వుంటే కాశీలో వున్నట్లే వుంటుందనీ చెప్పగా వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు.
దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంబంమీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది. వింధ్య పర్వతం గర్వమణిచే కార్యక్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడకొచ్చి కొంతకాలం ఇక్కడ నివసించాడు. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ. ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. ఈయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇలా అనేక విశేషాలతో ఈ దేవాలయం ఉంది. ఈక్షేత్రాన్ని సందర్శించి స్వామిని సేవిస్తే సకల భోగాలు ప్రాప్తిస్తాయి. అందుకే దీన్ని భోగక్షేత్రం అని అంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఉంది.
కేశవ