ఆంధ్రప్రదేశ్ కి 25 జిల్లాలు అయ్యే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. త్వరలోనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కూడా మొదలుపెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల కేబినేట్ మండలి రద్దు తీర్మానం కోసం సమావేశమైంది. ఈ సందర్భంగా మూడు జిల్లాలకు ఆమోదం తెలిపింది ప్రచారం ఎక్కువగా జరిగింది. మంత్రి వర్గ ఆమోద ముద్రపడిందనే వ్యాఖ్యలు వినిపించాయి.
అరకు, బందరు, గురజాల జిల్లాలుగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని, ఈ మూడు ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు అని ఇక్కడ మెడికల్ కాలీజీలు ఏర్పాటు చేస్తే కేంద్రం నుంచి నిధులు కూడా వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఒక్కో కాలేజీకి 600 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, మూడు కాలేజీలకు కలిపి 1800 కోట్లు ఖర్చు అయితే అందులో 60 శాతం కేంద్రం ఇస్తుంది.
దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మూడు జిల్లాలు కాదు 25 జిల్లాలు అనే ప్రచారం ఊపందుకుంది. బందరు, పల్నాడు, ఒంగోలు, కావలి, జమ్మలమడుగు, నర్సాపురం, కాకినాడ, అరకు, విజయనగరం రెండు జిల్లాలు, శ్రీకాకుళం రెండు జిల్లాలు, చేసే అవకాశం ఉందని, అలాగే కర్నూలులోని నంద్యాలను జిల్లాగా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మూడు జిల్లాలకు జగన్ శ్రీకారం చుట్టిన తర్వాత దీనిపై కసరత్తు కూడా జరిగిందని అంటున్నారు. ఇప్పటికే సీనియర్ అధికారులలో ఒక బృంద ఈ మేరకు పూర్తి స్థాయిలో సిద్దమైందని అంటున్నారు. త్వరలోనే కేబినేట్ సమావేశాలతో పాటుగా అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.