బైరాగి వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎక్కడుందో తెలుసా ?

-

శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే చాలు తిరుమల గుర్తుకువస్తుంది. అక్కడ స్వామికి అంగరంగ వైభోగంగా సేవలు జరుగుతుంటాయి. అయితే స్వామి సకల భోగాలూ అనుభవించే వేంకటేశ్వరుని బైరాగిగా ఊహించుకోలేము.. కానీ కర్ణాటకలోని ఓ ప్రదేశంలో శ్రీనివాసుడు బైరాగిగా కనిపిస్తారు. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉంది? ఆ స్వామి విశేషాలు తెలుసుకుందాం…

కర్ణాటకలోని శ్రీరంగపట్నం శివారు ప్రాంతంలో మైసూరు హైవే పక్కన ఓ కొండ కనిపిస్తుంది. రెండువేల అడుగులకు పైనే ఎత్తు ఉండే ఈ కొండ మీద ఉన్న ఆలయమే బైరాగి వేంకటేశ్వరస్వామి ఆలయం. ఈ కొండని ‘కరిఘట్ట’ అని పిలుస్తారు. కరి అంటే నలుపు అన్న అర్థం ఉంది కాబట్టి నల్లటి కొండ అన్న ఊహతో ఆ పేరు పెట్టి ఉండవచ్చు. కరి అంటే ఏనుగు అన్న అర్థం కూడా ఉంది. ఈ కొండ మీద ఏనుగులు తినే గడ్డి బాగా ఎదిగి కనిపిస్తుంది. అందుకనే ఏనుగుకొండ అన్న ఆలోచనతోనూ ఆ పేరు పెట్టినట్టు స్థానికులు చెప్పుకుంటారు. కరిఘట్ట మీద ఉన్న ఆలయం ఈనాటిది కాదు. వరాహపురాణంలో సైతం దీని ప్రస్తావన ఉంది.

ఇక్కడి కొండ మీద కనిపించే దర్భలు సాక్షాత్తు ఆ వరాహస్వామి శరీరం నుంచి ఉద్భవించాయని అందులో పేర్కొన్నారు. అప్పట్లో ఈ కొండను నీలాచలం అని పిలిచేవారట. మన తిరుపతిలో కనిపించే ఏడుకొండలలో ఒకటైన నీలాద్రిలోని కొంతభాగమే ఈ నీలాచలం అని అంటారు. ఇక్కడి మూలవిరాట్టుని వైకుంఠ శ్రీనివాసుడు లేదా కరిగిరివాసుడు అని పిలుస్తారు. ఆరడుగుల నల్లని రాతిలో కనిపించే ఈ మూలవిరాట్టుని సాక్షాత్తు ఆ భృగు మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు. ఈ స్వామికి అలంకారం చేసినప్పుడు, బైరాగిలా అగుపిస్తాడట. అందుకనే ‘బైరాగి వెంకటరమణుడు’ అని కూడా పిలుచుకుంటారు. పేరుకి బైరాగే కానీ ఈ స్వామిని కొలిస్తే ఎలాంటి కష్టమైనా తీరిపోతుందని భక్తుల నమ్మకం. జీవితంలో ఓర్చుకోలేని బాధలు వచ్చినప్పుడు, ఇక్కడ పూజలు నిర్వహిస్తే తప్పక ఫలితం దక్కుతుందట.

400 మెట్లు ఎక్కాలి !

కరిఘట్ట ఆలయానికి చేరుకునేందుకు 400కు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అలా ఎక్కలేనివారు వాహనాల్లో చేరుకునేందుకూ రహదారి ఉంది. కొండ పక్కనే కావేరి ఉపనది అయిన లోకపావని ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కొండ మీదకు ఎక్కినవారికి కరిగిరివాసుని దర్శనం ఎలాగూ దక్కుతుంది. దానికి తోడుగా లోకపావనికి ఆవలి ఒడ్డున ఉండే నిమిషాంబ ఆలయం, శ్రీరంగపట్నంలోని రంగనాథస్వామి ఆలయాలు కూడా కనిపిస్తాయి. వీటితో పాటు మైసూరు, శ్రీరంగపట్నం, చాముండి హిల్స్ కూడా కనువిందుచేస్తాయి. మైసూర్‌ నుంచి శ్రీరంగపట్నానికి వెళ్లే యాత్రికులు తప్పకుండా ఈ కరిఘట్ట ఆలయాన్ని కూడా సందర్శిస్తారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version