ఆ ఏడుకొండలు ఈనాటి కొండలు కావు. అసలు ఆ కొండలే వేంకటేశ్వరుడంటారు. అందుకనే ఆ కొండ పాదాన్ని స్వామి పాదుకలుగా భావించి అర్చన చేస్తారు. భక్తికి ఎంతగా పరవశించిపోతాడో చూపడానికి అన్నమాచార్యులవారు తన కీర్తనలో..“కుమ్మర దాసుడైన కురువరతినంబి యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు. దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు” అన్నాడు. శ్రీవేంకటాచలం క్షేత్రానికి దగ్గరలో కుండలు చేసుకుంటూ జీవనం సాగించే భీముడనే కుమ్మరి.. స్వామివారి భక్తుడు.
తన పూరి గుడిసెలోనే ఒక మూలన స్వామి వారి విగ్రహాన్ని పెట్టుకుని తాను కుండలు చేసే ముందు మట్టితో చేసిన తులసీదళాలను స్వామి వారికి అర్పిస్తూ అర్చన చేసేవాడు. ‘బంగారు దళాలతో పూజచేసే తొండమాన్ చక్రవర్తి అహంకారాన్ని అణచడానికి, నిస్వార్థంగా, పారవశ్యంతో పూజించే భీముడింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించావు. ఎంత దయాసముద్రుడివయ్యా’ అని పొంగిపోతూ కీర్తన చేసారు అన్నమయ్య. స్వామికి కావలసింది బంగారు పుష్పాలు కాదు, హృదయ పుష్పాలు.
అలా మట్టితో చేసిన పువ్వులను అందరూ చూస్తే దానితో హృదయాన్ని అర్పించిన ఆ భీమునికి దర్శనిమిచ్చిన ఆ మహా భక్త సులభుడు శ్రీనివాసుడు. మాకు ఏమీ లేదు అందరిలాగా కోట్లు, లక్షలు స్వామికి విరాళం ఇవ్వడానికి అనుకోకుండా హృదయపుష్పాన్ని ఆయనకు సమర్పిస్తే చాలు మనకు ఆయన వశ్యం అవుతాడు.
– కేశవ