దేవాలయంలో మొదటి మెట్లకు ఉన్న పేర్లు మీకు తెలుసా ?

-

దేవాలయం అంటే దాదాపు ఎక్కువ శాతం కొండపైన లేక కొంత ఎత్తుప్రదేశంలో ఉంటాయి. పురాతన ఆలయాలు దాదాపు అన్ని ఎత్తుపైననే ఉండేవి. వాటిని చేరుకోవడానికి రకరకాల మార్గాలను ఏర్పాటు చేశారు. వాటిలో ప్రధానమైనది మెట్ల మార్గం. ఆ మెట్లనే సోపానాలు అని కూడా అంటారు అయితే ఆ సోపానాలకు రకరకాల పేర్లు, వాటి వెనుక విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం….

ఆలయాల్లో దైవదర్శనం చేసుకోవాలంటే మనకు మార్గం చూపేవి సోపానాలే. మెట్లే కదా అని మనం అనుకున్నా వాటివెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి ప్రత్యేకంగా పేర్లున్నాయి. ఆలయంలోకి వెళ్లేందుకు చాలా చోట్ల ముఖమండపం,  రంగమండపం ద్వారా లోపలికి వెళ్లడానికి రెండువైపుల నుండి మెట్లు ఉంటాయి. ఆ మెట్లను సోపానమాలా అంటారు.

మెట్ల పేర్లు ఇవే !

మెట్లలో మొదటి మెట్టును అశ్వపాదం అనీ.. చివరి మెట్టును ఫలకం అని పిలుస్తారు. మెట్లకు అటూ ఇటూ పట్టుకోవడానికి ఆలంబనగా ఏనుగుతల.. తొండం.. ఉంటే దాన్ని హస్తిహస్తం అంటారు. రథచక్రాలన్ని అటూ ఇటూ నిర్మిస్తే రథాంగ సోపానమంటారు. మకరముఖాన్ని లతా మండపాన్ని కూడా నిర్మిస్తారు. ఇలాంటి నిర్మాణాన్ని కుడ్యసోపానం అంటారు. కొన్నిచోట్ల మెట్లు ఉన్నా తడిమి చూస్తే తప్ప అక్కడ మెట్లున్నట్టు మనకు తెలియదు. ఉదాహరణకు పురాతన దేవాలయాలైన… అహోబిలం, మేల్కోట వంటి గుహాలయాల్ని దర్శించినప్పుడు భక్తులు వీటిని గమనించవచ్చు. అక్కడ మెట్లు అంత స్పష్టంగా కనపడవు. వీటిని గుహ్య సోపానాలంటారు. ఇక రెండోరకమైనవి అగుహ్య సోపానాలు.

మెట్లను గుర్తుపట్టే విధంగా ఉండే వీటిలో నాలుగు రకాలున్నాయి. ఎదురుగా.. కుడివైపు ఎడమవైపు ఇలా మూడు వైపులా ఎక్కే విధంగా ఉండే దాన్ని త్రిఖండాకార సోపానం అంటారు. పైన వెడల్పుగా ఉండి కిందికి దిగుతుండగా క్రమేపీ చిన్నదవుతూ ఉన్న మెట్లమార్గాన్ని శంఖమండలం అంటారు. సగం సున్నా వంటి మెట్లను అర్ధగోమూత్రం అనీ.. ఓ స్తంభానికి చుట్టూ మెట్లు ఏర్పరచి పైకెళ్లేలా ఉంటే దాన్ని వల్లీమండల సోపానాలంటారు. ఆలయాల్లో నిర్మించే మెట్లు సరిసంఖ్యలో ఉండాలని.. మానవ గృహాలకు మెట్లు బేసిసంఖ్యలో ఉండాలని నియమం. పైగా మెట్లు పిల్లలు.. వృద్ధులు.. మిగిలిన అందరూ ఎక్కి దిగడానికి ఇబ్బంది లేకుండా ఆరంగుళాల ఎత్తు మాత్రమే ఉండాలని శిల్పశాస్త్ర నియమం. చూశారా పురాతన కాలంలో కూడా ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా శాస్త్రీయంగా నిర్మించిన దేవాలయాల వెనుక ఎన్ని రహస్యాలు ఉన్నాయో. సనాతన ధర్మం అంటేనే ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండేది.

శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news