నిజామాబాద్​లో మళ్లీ ఫ్లెక్సీల కలకలం.. నేడు బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా..

-

నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. నిన్న ఓ వర్గం బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా హోర్డింగులు వెలిశాయి. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.

నిరుద్యోగ భృతి, ఎన్​ఆర్​ఐ సెల్, రెండు పడక గదుల ఇళ్లపై నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిన్న పసుపు బోర్డు పై పసుపు రంగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ బీఆర్ఎస్ హామీలపై ఫ్లెక్సీలు వెలిశాయి. రూ.3016 వచ్చేలా నోట్లను ముద్రించి నిరుద్యోగ భృతి పై వ్యంగ్యంగా రాశారు. రెండు పడక గదుల ఇళ్లపై కేసీఆర్ కుటుంబం మీద, సెల్ ఫోన్ ముద్రించి ఎన్ ఆర్ ఐ సెల్ మీద ఫ్లెక్సిల్లో రాశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మేల్యే క్యాంప్ ఆఫీస్ తో పాటు నిజామాబాద్ నగరంలో నిన్న పసుపు రంగు ఫ్లెక్సీలు పెట్టిన ప్రతి చోటా ఈరోజు పోటాపోటీ ఫ్లెక్సీలు ఉంచారు. నగరంలో పలు చోట్ల పరస్పరం ఫ్లెక్సీలు చించివేశారు.

ఎమ్మెల్సీ కవిత కు వ్యతిరేకంగా వంద రోజుల్లో తెస్తానన్న షుగర్ ఫ్యాక్టరీ తేవాలని రాశారు. సీఎం కు ఫామ్ హౌస్, కవిత కు బుర్జు ఖలీఫాలో ఫ్లాట్, ఎమ్మెల్యే కు జీవన్ మాల్ అంటూ ఆర్మూర్ నియోజకవర్గంలో ఫ్లెక్సీల్లో రాశారు. ఉచిత ఎరువులు, ఏకకాలంలో లక్ష రుణమాఫీ వంటి వాటిపైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఫ్లెక్సీలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news