ఈటెలను జైల్లో పెట్టినా.. హుజురాబాద్ లో గెలిపిస్తాం : కేంద్ర మంత్రి

ఈటెలను జైల్లో పెట్టినా.. హుజురాబాద్ లో గెలిపిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన కిషన్‌ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈటలను రకరకాలుగా రాజకీయ కక్షతో వేధిస్తున్నారని.. అయినప్పటికీ విజయం తమదేనని స్పష్టం చేశారు. మా సర్వేలో కూడా హుజురాబాద్ లో బీజేపీ గెలుస్తుందని వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్యే హుజురాబాద్ లో పోటీ ఉంటుందని…టీఆర్‌ఎస్‌ కు వ్యతిరేకంగా పోరాడే పార్టీ బీజేపీనే పేర్కొన్నారు.

కాంగ్రెస్ నిన్నటి పార్టీ, దానికి రేపు లేదని.. బీజేపీ.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి, అందుకు ఉత్సాహంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్‌ పాదయాత్ర ను అందరూ విజయవంతం చేయాలని.. మంచి, నీతివంతమైన, కమీషన్ లేని, ప్రజల ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ ఇస్తుందన్నారు. హుజురాబాద్ ఎన్నికలను ధర్మానికి… అధర్మానికి జరుగుతున్న ఎన్నికలుగా భావిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ కారులకు, అవకాశ వాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని.. టీఆర్‌ఎస్‌ ఎత్తులను హుజురాబాద్ లో చిత్తు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు, తెలంగాణ ఉద్యమ కారులు ఎటు నిలబడతారో తేల్చుకోవాలన్నారు.