ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు తనను బయటకు రావద్దని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల మీద మంత్రి పెద్దిరెడ్డి నిన్న ఏపీ హైకోర్టు లో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ హౌస్ మోషన్ పిటీషన్ విచారణ కొద్దిసేపటి క్రితం ఏపీ హైకోర్టులో ప్రారంభమైంది. పెద్దిరెడ్డి తరుపు న్యాయవాది పెద్దిరెడ్డి వర్షన్ వాదనలు వినిపిస్తున్నారు.
నిజానికి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారులు ఎవరూ నిమ్మగడ్డ చెప్పినట్టు చేయకూడదని నిమ్మగడ్డ మార్చి 31 వరకు ఆ పదవిలో ఉంటారని ఆ తర్వాత ఆయన చెప్పినట్లు చేసిన అధికారులు అందరినీ బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియకు అడ్డుతగులుతున్నారంటూ పెద్దిరెడ్డి మీద సంచలన ఆదేశాలు జారీ చేశారు. అలానే ఈ ఆదేశాలు కరెక్టో కాదో చూడాలంటూ కేంద్ర హోంశాఖ సెక్రెటరీకి కూడా లేఖ రాశారు. ఇప్పుడు హైకోర్టు ఏమని తీర్పు ఇస్తుంది అనే అంశం చర్చనీయాంశంగా మారింది.