దైవం ముందు దీపారాధన ఎందుకు, ఎలా చేయాలి?

-

హిందువులు దేవుడి విగ్ర‌హం లేదా చిత్ర‌ప‌టానికి ధూప‌దీప నైవేద్యాలు స‌మ‌ర్పించి దైవాన్ని ఆరాధిస్తుంటారు. అందులో భాగంగా దీపాన్ని కూడా వెలిగిస్తారు. దీపంతో మ‌న‌లో దాగి ఉన్న దైవీక శ‌క్తులు మేల్కొల్ప‌బ‌డ‌తాయి. శారీర‌క‌, మాన‌సిక బ‌లం క‌లుగుతుంది. దీనికి తోడు దీపం వెలిగించి మ‌నం దైవాన్ని ప్రార్థిస్తే కోరిన కోర్కెల‌న్నీ నెర‌వేరుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి.

సకల సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి జ్యోతిస్వరూపిణి. ఏ శుభ కార్యారంభంలోనైనా దీప ప్రకాశనం చేయడం మన ఆచారం. అగ్నిసాక్షిగా పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్న భావన దీపారాధనతో కలుగుతుంది. దీపాలను వెలిగించడమంటే మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారదోలి జ్ఞానకాంతిని ఆహ్వానించడమే. దీపంలో కనిపించే నీలం, పసుపు, తెలుపు వర్ణాలు మనలోని సత్వరజస్తమోగుణాలకు ప్రతీకలు.

సత్యం, శివం, సుందరాలకు సంకేతాలవి. సృష్టిని చైతన్యవంతం చేసే చైతన్య కిరణాలు దీపకాంతి నుంచే ప్రభవిస్తాయి. భగవంతుడికి చేసే షోడశోపచారాల్లో దీప సమర్పణ ప్రధానమైనది. దీపం వేడిని భూమాత భరించలేదని ప్రమిదలో ప్రమిద వేసి మరీ దీపం వెలిగిస్తారు కొందరు. మూడు వత్తులతో దీపారాధన చేయాలి. దీపారాధనకు వాడే నూనె సువర్ణవర్ణంలో ఉంటే మంచిది. నూనె ఎంత పల్చగా ఉంటే అంత మంచిది. ఆవునెయ్యి ఉత్తమం. నువ్వులనూనె మధ్యమం. ఇప్పనూనె అధమం అని చెప్పారు. ఆవునెయ్యితో వెలిగించిన దీపం ఉత్తమమైనది.

అయితే దైవం ఎదుట దీపాన్ని ఎలా ప‌డితే అలా వెలిగించ‌రాదు. అందుకు కొన్ని నియ‌మాలు ఉన్నాయి. అవేమిటంటే…

1. దైవం ఎదుట దీపాన్ని నేల‌పై పెట్టి వెలిగించ‌రాదు. దీపం కింద అర‌టి ఆకు లేదా త‌మ‌ల‌పాకు, ప‌ళ్లెం ఉంచాలి. లేదా కింద శుభ్రంగా తుడిచి ముగ్గు వేసి దానిపై దీపం పెట్ట‌వ‌చ్చు.

2. దీపాన్ని వెలిగించేందుకు ఆవు నెయ్యి లేదా న‌ల్ల నువ్వుల నూనె వాడాలి. గేదె నెయ్యితో దీపారాధ‌న చేయ‌రాదు.

3. ఉద‌యం పూజ చేసేట‌ప్పుడు దీపం తూర్పు దిక్కున ఉండాలి. సాయంత్రం ఒక వ‌త్తి తూర్పు దిశ‌గా, మ‌రొక వ‌త్తి ప‌డ‌మ‌ర దిక్కుగా ఉంచి దీపాన్ని వెలిగించాలి.

4. దీపాన్ని వెలిగించేందుకు మూడు వ‌త్తులు వాడితే తూర్పు, ప‌డ‌మ‌ర‌, ఉత్త‌ర దిక్కుగా వ‌త్తుల‌ను ఉంచి వెలిగించాలి.

5. ఐదు వ‌త్తులు ఉంచి దీపాన్ని వెలిగిస్తే.. తూర్పు, ప‌డ‌మ‌ర‌, ఉత్త‌ర‌, ద‌క్షిణ‌, ఈశాన్య దిశ‌ల్లో వత్తుల‌ను ఉంచి దీపాన్ని వెలిగించాలి.

6. వెలిగించిన దీపాన్ని నోటితో ఊద‌రాదు. వ‌త్తిని చ‌మురులోకి జార్చాలి. దీంతో దీపం ఆరిపోతుంది. లేదా వెలుగుతున్న వ‌త్తిపై నూనె పోయాలి. దీంతో దీపం ఆరిపోతుంది.

దీపారాధ‌న చేసే స‌మ‌యంలో కింద ఇచ్చిన శ్లోకాన్ని ప‌ఠిస్తే దైవానుగ్ర‌హం ల‌భిస్తుంది..!

దీపం జ్యోతి పరంబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే!

Read more RELATED
Recommended to you

Latest news