ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తమ నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేసింది. ఇప్పటికే గతంలో ఈ టోర్నీ నిర్వహణపై నిర్ణయాన్ని జూన్ 10వ తేదీకి వాయిదా వేయగా.. ఐసీసీ బుధవారం బోర్డు మెంబర్లతో మరోసారి సమావేశమైంది. టెలి కాన్ఫరెన్స్ ద్వారా సభ్యులు టీ20 వరల్డ్ కప్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. దీంతో జూలై వరకు ఈ టోర్నీ నిర్వహణపై తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు.
అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 తేదీల మధ్య ఆస్ట్రేలియాలో ఈ సారి టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అక్కడ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం అమలులో ఉంది. అయితే అక్టోబర్ వరకు అసలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కరోనా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దీంతో ఐసీసీకి టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నిర్ణయం తీసుకోవడం తలనొప్పిగా మారింది. కాగా ఆస్ట్రేలియా క్రీడా శాఖ మంత్రి రిచర్డ్ కోల్‌బెక్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తాము ఇప్పటికీ ఆసక్తిగా ఉన్నామని తెలిపారు.
అయితే ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహిస్తే.. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంటుందని.. అది తమకు ఎంతో నష్టాన్ని కలిగిస్తుందని.. మరో వైపు క్రికెట్ ఆస్ట్రేలియా అభిప్రాయపడుతోంది. ఇక టీ20 వరల్డ్ కప్‌పై ఐసీసీ ఓ నిర్ణయానికి రావల్సి ఉందని ఇటు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఐపీఎల్ నిర్వహణపై స్పష్టత వస్తుందన్నారు. అయితే ఐసీసీ ప్రస్తుతం ఆ టోర్నీ నిర్వహణపై తమ నిర్ణయాన్ని మరోమారు వాయిదా వేయడంతో బీసీసీఐకి కూడా ఈ విషయం తలపోటుగా మారింది. ఇక జూలై వరకు వేచి చూస్తే తప్ప ఈ విషయంపై స్పష్టత రాదు.