హైద‌రాబాద్ ఎంత డేంజ‌రో చూడండి…

-

మెట్రో న‌గ‌రాలు రేడియేష‌న్ తీవ్ర‌త‌తో విల‌విల‌లాడుతున్నాయి. ఇటీవ‌లి కాలంలో హైదరాబాద్‌తోపాటు పలు మెట్రో న‌గ‌రాల్లో చోటు చేసుకుంటున్న అసాధార‌ణ‌మైన మార్పులు న‌గ‌ర‌వాసుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. మెట్రో న‌గ‌రాల్లో రేడియేషన్‌ తీవ్రత క్రమంగా పెరుగుతోందని ఇటీవల బార్క్‌ అధ్యయనంలో వెల్ల‌డైంది. ఇప్ప‌టికే కళ్ల మంటలు, త్వరగా అలసిపోవడం, తెల్లరక్త కణాలు తగ్గడం, జట్టు రాలడం, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు లాంటి సమస్యల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న న‌గ‌ర‌జీవికి.. ఇప్పుడు బార్క్ నివేదిక మ‌రింత భ‌యాందోళ‌కు గురి చేస్తోంది.


అయితే ఈ సమస్యలకు రేడియేషన్‌ కూడా ఓ కారణమ‌ని పేర్కొంటోంది బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌). తాజాగా చేపట్టిన అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాల‌ను తేట‌తెల్లం చేసింది బార్క్ . దక్కన్‌ పీఠభూమిలో అనేక భౌగోళిక ప్రత్యేకతలున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ఇటీవలి కాలంలో రేడియేషన్‌ (వికిరణ తీవ్రత) అధికంగా నమోదవుతుతోంద‌ని బాంబు పేల్చింది. అయితే దీన్ని శాస్త్రీయంగా లెక్కించే విషయంలో మాత్రం పీసీబీ (పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్‌) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండ‌టం ఇబ్బందిక‌రంగా మారింది.

గతేడాది గ్రేటర్‌ పరిధిలో రేడియేషన్‌ తీవ్రతపై బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) నిపుణులు చేపట్టిన అధ్యయనంలో ఏటా 2 మిల్లీసీవర్ట్స్‌ (రేడియేషన్‌ కొలిచే ప్రమాణం) మేర నమోదవుతున్నట్లు తేలింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ తీవ్రత ఏటా 1 మిల్లీ సీవర్ట్స్‌కు మించరాదు. కాగా ఈ రేడియేషన్‌ తీవ్రతను శాస్త్రీయంగా లెక్కించేందుకు ఎన్విరాన్‌మెంటల్‌ రేడియేషన్‌ మానిటర్స్‌ (ఈఆర్‌ఎం)ను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని బార్క్‌ పరిశోధన సంస్థ పీసీబీకి సూచించినా ఫలితం లేదు.

హైదరాబాద్‌లో గ్రానైట్, బాసాల్ట్, గోండ్వానా శిలా స్వరూపాలు అత్యధికంగా ఉన్నాయి. వీటి నుంచి వెలువడే వికిరణాలు సైతం రేడియేషన్‌ పెరిగేందుకు కారణం అవుతున్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు.  అంతేగాక పెట్రోలు, డీజిల్‌ వంటి ఇంధనాల వినియోగం పెరగడం, కాలం చెల్లిన వాహనాలు వాడకం, పరిశ్రమల కాలుష్యం అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి.

మరోవైపు భూమి పైపొరలపై విశ్వకిరణాలు (కాస్మిక్‌ కిరణాలు) పడుతుండటం, సిటీ కాంక్రీట్‌ జంగిల్‌లా మారడంతో భూమి వాతావరణం నుంచి వికిరణ తీవ్రత పైకి వెళ్లే దారులు లేక, రేడియేషన్‌ తీవ్రత క్ర‌మంగా పెరుగుతోందని తేలింది. ఇప్ప‌టికైనా న‌గ‌ర ప్ర‌జ‌లు మేల్కోక పోతే భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని వాతావ‌ర‌ణ నిపుణ‌లు హెచ్చ‌రిస్తున్నారు. ఇందుకు గ్రేటర్‌ పరిధిలో 8 శాతం మేర ఉన్న హరిత వాతావరణాన్ని 30 శాతానికి పెంచ‌డం మిన‌హా మ‌రో మార్గం లేద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news