10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గ్రేడింగ్‌.. ఎలా లెక్కిస్తారంటే..?

-

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ సారి 10వ త‌ర‌గ‌తి పరీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే విద్యార్థుల‌కు సంబంధించి ప‌రీక్షా ఫ‌లితాల‌ను స‌ర్కారు వెల్ల‌డించ‌నుంది. అయితే రిజ‌ల్ట్స్ కోసం స్కూళ్ల‌లో నిర్వ‌హించే అంత‌ర్గ‌త ప‌రీక్ష‌ల మార్కుల‌నే ఆధారంగా తీసుకోనున్నారు. ఈ క్ర‌మంలో 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు నిర్వ‌హించే ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ) ప‌రీక్ష‌ల్లో వ‌చ్చే మార్కుల ఆధారంగా ప్ర‌భుత్వం వారి గ్రేడింగ్‌ను లెక్కించి రిజ‌ల్ట్స్‌ను విడుద‌ల చేయ‌నుంది. అయితే వాటిని ఎలా లెక్కిస్తారంటే…

how grading is calculated for 10th students in telangana

10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఏడాదిలో 4 సార్లు ఎఫ్ఏలు నిర్వ‌హిస్తారు. ఈ క్ర‌మంలో వాటి స‌గ‌టును ప్ర‌స్తుతం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆ ప్ర‌కారం గ్రేడింగ్ లెక్కిస్తారు. ఇక ఒక్కో ఎఫ్ఏ ప‌రీక్ష‌ను 20 మార్కులకు నిర్వ‌హిస్తారు. అందులో రాత ప‌రీక్ష‌, ప్రాజెక్ట్ వ‌ర్క్‌, నోట్‌బుక్‌, త‌ర‌గ‌తి గది స్పంద‌న‌కు.. మొత్తం క‌లిపి 5+5+5+5 = 20 మార్కుల‌కు ఒక్కో ఎఫ్ఏ ప‌రీక్ష ఉంటుంది. అయితే వీటిలో రాత ప‌రీక్ష‌ను ముందుగా 20 మార్కుల‌కే నిర్వ‌హించినా.. త‌రువాత అందులో వ‌చ్చే మార్కుల‌ను 5కు త‌గ్గిస్తారు. దాంతో ఆ 5 మార్కుల‌కు తోడు మిగిలిన 3 అంశాల్లో వ‌చ్చే 15 మార్కులు.. మొత్తం క‌లిపి 20 మార్కుల‌కు ఒక్కో ఎఫ్ఏ ప‌రీక్ష ఉంటుంది. ఈ విధంగా ఒక్క విద్యార్థికి ఉదాహ‌ర‌ణ‌కు ఒక‌ ఎఫ్ఏ ప‌రీక్ష‌లో 20కి 12 మార్కులు వ‌చ్చాయ‌నుకుంటే.. అదే 100కు అయితే.. 60 మార్కులు వ‌చ్చిన‌ట్లు అన్న‌మాట‌. ఈ విధంగా ఫైన‌ల్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను లెక్కిస్తారు.

అయితే హిందీలో విద్యార్థి పాస్ కావాలంటే 100కు 20 మార్కులు రావాలి. అంటే ఎఫ్ఏ ప‌రీక్షలో స‌గ‌టున 20కి క‌నీసం 4 మార్కులు అయినా రావాల్సి ఉంటుంది. అదే మిగిలిన స‌బ్జెక్టులు అయితే 100కు 35 మార్కులు రావాలి. అంటే.. ఎఫ్ఏ ప‌రీక్షలో 20కి స‌గ‌టున క‌నీసం 7 మార్కులు రావాలి. అయితే సాధారణంగా స్కూళ్ల‌లో ఏ విద్యార్థికైనా స‌రే.. ఫెయిల్ అవ్వ‌కుండా ఉండాల‌ని.. క‌నీసం 8 లేదా 9 మార్కుల‌ను ఎఫ్ఏ ప‌రీక్షల్లో వేస్తుంటారు. అందువ‌ల్ల విద్యార్థులు ఈసారి అస‌లు ఫెయిల్ అయ్యే అవ‌కాశ‌మే ఉండ‌దు. ఈ క్ర‌మంలో ఈసారి 10వ త‌ర‌గ‌తి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణుల‌వుతారు. ఇక మొత్తం స‌బ్జెక్టుల‌ మార్కుల‌ను 100కు లెక్కించాక‌.. వాటికి అనుగుణంగా గ్రేడ్‌ల‌ను నిర్దారించి.. త‌రువాత ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తారు.

కాగా ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద విద్యార్థుల ఎఫ్ఏ ప‌రీక్ష‌ల మార్కుల జాబితాలు ఉన్నాయి. అందువ‌ల్ల ఫ‌లితాలు చాలా త్వ‌ర‌గా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. మ‌రో 10 రోజుల్లో ఫ‌లితాలు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news