కరోనా ఎఫెక్ట్‌తో సినీ పరిశ్రమ కుదేలైంది. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. రెండు నెలల తర్వాత షూటింగ్స్‌ను పునః ప్రారంభించడానికి చిత్ర పరిశ్రమ నుండి చిరంజీవి ఇతర సినీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపారు. కాగా.. జూన్ 9న ఏపీ సీఎం జగన్‌ను చిరంజీవి అండ్ టీమ్ కలవబోతున్నారనే విషయాన్ని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు.
ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు జయంతి వేడుకల్లో పాల్గొన్న సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్స్ ప్రారంభించడానికి అందరం ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జూన్ 9 మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎం జగన్ అపాయింట్‌మెంట్ దొరికింది. ఈ మీటింగ్‌కు రావాలని నటుడు నందమూరి బాలకృష్ణగారికి నేను ఫోన్ చేసి ఆహ్వానించాను. అయితే జూన్ 10న బాలకృష్ణగారి పుట్టినరోజు. ఆయన కాస్త బిజీగా ఉండటం వల్ల రాలేకపోయే అవకాశాలున్నాయి. చిరంజీవిగారు, ఇతర పెద్దలు జగన్‌ని కలుస్తున్నాం’’ అన్నారు.
అయితే, బాలయ్య వ్యవహారంపై మరో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తాను నటుడిగానే కాకుండా.. రాజకీయ నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి రెండుసార్లు ఎన్నిక య్యారు. ఈ క్రమంలో ఇటీవలే మహానాడులో ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. మరో ఏడాదిన్నరలో జమిలి ఎన్నికలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. జగన్‌తోనూ ప్రత్యక్ష వైరంతోనే ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో జగన్‌తో సానుకూల చర్చలకు వచ్చే ఉద్దేశం ఆయనకు లేదనిప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పుట్టిన రోజు అంశాన్నితెరమీదికి తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
మొత్తంగా సినీ పరిశ్రమ కష్టాల విషయంలో నూ బాలయ్య రాజకీయాలు చూసుకుంటున్నారనే విమర్శలు సినీ వర్గాల్లో ప్రచారం లోకి వచ్చాయి. ఇటీవల కేసీఆర్‌తో మీటింగ్ సందర్భంగా తనను పిలవలేదని చెప్పుకొన్న ఆయన.. ఇప్పుడు జగన్ విషయంలో తప్పించుకుంటున్నారని అంటున్నారు. మొత్తంగా ఈ పరిణామం.. సినీ రంగానికి మంచిదికాదనే సూచనలు కూడా వస్తున్నాయి రాజకీయాలు ఉంటే.. మీరు మీరు చూసుకోవాలి కానీ.. వేలాది మంది నటులు, కార్మికులకు సంబంధించిన విషయంపై ఇలా వ్యవహరించడం తగదని అంటున్నారు మరి బాలయ్య మనసు మార్చుకుంటారో లేదో చూడాలి.