జనసేనాని పవన్ కల్యాణ్ నిన్నటివేళ నరసాపురంలో 217 జీఓ కాపీని చింపేశారు.వివాదస్పద జీఓ అమలును వ్యతిరేకించారు.అదే మాట నిన్నటి వేళ మత్స్యకార అభ్యున్నతి సభలో చెప్పారు. తాను జాలర్ల కోసం వారి అభ్యున్నతి కోసం పాటుపడతానని చెప్పారు. వాస్తవానికి ఎప్పటి నుంచో మత్స్యకార జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్న వివాదాస్పద జీఓ 217పై పోరాటాలు ఉన్నా రాజకీయంగా ప్రభావితం చేయగలిగే నాయకులు లేరు.
జగన్ కూడా ఏకపక్ష ధోరణిలోవెళ్తున్నారన్న ఆరోపణలు విపక్షం నుంచి ఉన్నాయి.ఇదే దశలో టీడీపీ కూడా ఇలాంటి తిక్క పనులే చేసింది.పర్యావరణ పరిరక్షణకు ఆ రోజు టీడీపీ కానీ ఇవాళ వైసీపీ కానీ సమ ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలే లేవని జనసేన నెత్తీ నోరూ కొట్టుకుంటోంది.ఈ దశలో నిన్నటి జీఓ కాపీ చింపేశారు.అదేం పెద్ద తప్పు కాకపోయినా తనపై పోలీసు కేసు నమోదు చేస్తారు అని పవన్ అన్నారు. కానీ అంతటి స్థాయిలో జరిగిన తప్పేం కాదు.ఎందుకంటే మొన్నటి వేళ పీఆర్సీకి సంబంధించి కూడా ఉద్యోగులు ఇలానే జీఓ కాపీలు దగ్ధం చేశారు అయినా కూడా సీఎం ఒక్కటంటే ఒక్క కేసు వారిపై నమోదు చేయనివ్వలేదు.జీఓ కాపీ చింపడం అన్నది నిరసనలో ఓ చిన్న భాగం,దానికే పోలీసు కేసు అంటే ఎలా?
లోక్ సభలో బడ్జెట్ కాపీలు చింపినా,గతంలో రాహుల్ కాంగ్రెస్ తీసుకువచ్చిన ఓ ఆర్డినెన్స్ ను చింపి విసిరేసినా ఇవన్నీ కూడా నిరసనలో భాగాలు వాటిపై పోలీసు కేసులు నమోదు చేయడం అన్నవి జరగని పని. కానీ పవన్ ఎందుకనో ఆ మాట అన్నారు.
ఇక నిన్నటి సభ విషయానికే వద్దాం.సభ నిర్వహణ బాగుంది కానీ కట్టడి లేని అభిమానుల గోల కారణంగా చాలావినలేకపోయాం అని జనసేన సొంతింటి మనుషులే బాధపడుతున్నారు.సభకు సంబంధించి వైసీపీ కూడా బాగానే ఫాలో అయింది. టీడీపీ శ్రేణులు ఇంకాస్త మద్దతిస్తే బాగుండు కానీ ఎందుకనో జనసేనను ఈ సారి టీడీపీలో కొందరు పట్టించుకోలేదు. దిగువ స్థాయి నేతలు, కింజరాపు శ్రేణులు సోషల్ మీడియా వేదికగా మంచి మద్దతే ఇచ్చారు.
ఏదేమయినప్పటికీ పవన్ పోరాట పటిమ మరికొంత పెంచుకుంటే బాగుంటుంది. అదేవిధంగా విషయ అవగాహన ఉంది కానీ ఇంకా వాటిపై లోతైన అధ్యయనం లేదనే కొన్నిసార్లు స్పష్టం అవుతుంది. కొన్ని విషయాలు చెప్పిన తీరు బాగున్నా, వాటిపై ముందున్న కాలంలో పోరాటం చేయాలి. ఎట్టకేలకు ఓట్లు సీట్లు రాజకీయాలను పవన్ కాస్త నమ్ముతున్నారనే నిన్నటి వేళ తేలింది.