ప్రాణాంతక విషవాయువు స్టిరీన్ లీక్ అయిన ఘటనతో వైజాగ్ నగరం ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది. ప్రజలు ఊపిరితీసుకునేందుకు కష్టపడ్డారు. విషవాయువు నుంచి తప్పించుకునే లోపే పలువురిని ఆ గ్యాస్ పొట్టన పెట్టుకుంది. ఎంతోమంది ఆ గ్యాస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతానిక ప్రమాదం తప్పినా.. ఆ విషవాయువు వాతావరణంలో ఇంకా ఎంత సేపు ఉంటుందనే విషయం ఇప్పుడు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
స్టిరీన్ వాయువు గాలిలోనైతే 7 నుంచి 16 గంటల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే వాయువు నీటిలో లేదా మట్టిలో కలిస్తే.. అది వాటిలో కలిసిపోయేందుకు చాలా సమయం పడుతుందని వారంటున్నారు. అలాంటప్పుడు ఆ నీరు, మట్టి రెండూ కూడా మనకు ఇబ్బందులు కలిగించేందుకు అవకాశం ఉంటుందని, దాంతో అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇక స్టిరీన్ వాయువు నిత్యం పలు రకాల పరిశ్రమల నుంచి వెలువడినా అది తక్కువ మోతాదులో ఉంటుంది కనుక.. వాతావరణంలో చాలా వేగంగా అది కలిసిపోతుంది. కానీ ఆ వాయువు వైజాగ్‌లో ఇప్పుడు పెద్ద మొత్తంలో లీకవడంతో ఇకపై ప్రజలు ఆ ప్రాంతంలో నివాసం ఉండాలా, వద్దా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..!