తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్ జిల్లాలు వర్షాలకు దారుణంగా ప్రభావితమయ్యాయి. ఇప్పటికే ఈ జిల్లాల్లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.రాష్ట్ర సర్కార్ వెంటనే స్పందించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మన్నేరువాగు ధాటికి ముంపు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలు గ్రామాలను మున్నేరు ముంచెత్తడంతో దాదాపు పది గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రకటించిన రూ.10వేలు దేనికి సరిపోతాయని వరద బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కో కుటుంబం సగటున రూ.2 లక్షలు నష్టపోయిందని, ప్రభుత్వం అందించే సాయం ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, ప్రస్తుతం తక్షణ సాయం అందిస్తామని, ఆ తర్వాత సర్వే చేసి పూర్తి నష్టంపై ఓ అంచనాకు వచ్చాక మరల సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సర్వే ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు నష్టపరిహారం ఇస్తారని ముంపు గ్రామాల బాధితులు ఆందోళన చెందుతున్నారు.