కరోనా నేపథ్యంలో ప్రస్తుతం జనాలందరూ తమ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే వారు నిత్యం అనేక రకాల పదార్థాలను తీసుకుంటున్నారు. వాటిల్లో తేనె కూడా ఒకటి. తేనెలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో తేనె బాగా ఉపయోగపడుతుంది. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తేనెను ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా పలు ప్రముఖ బ్రాండ్లు అమ్ముతున్న తేనెపై వివాదం నెలకొంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) చేపట్టిన పరీక్షల్లో మన దేశంలోని పలు ప్రముఖ బ్రాండ్లు అమ్మే తేనెలలో చాలా వరకు కల్తీవే ఉన్నాయని గుర్తించారు.
అయితే తేనె అనే కాదు నిజానికి మనం ఏ పదార్థం అయినా సరే కల్తీ అయ్యేవి వాడకూడదు. వినియోగదారులుగా మనం పెట్టే డబ్బుకు అసలైన పదార్థాలను వాడే హక్కు ఉంటుంది. దీనిపై అవసరం అయితే మనం కన్‌జ్యూమర్ ఫోరంకు కూడా వెళ్లవచ్చు. అయితే తేనె విషయానికి వస్తే మనం వాడే తేనె అసలుదేనా, కల్తీ జరిగిందా ? అనే విషయాన్ని మనం సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు కింద సూచించిన టిప్స్ పాటించాలి. అవేమిటంటే..
1. తేనె కల్తీ జరిగిందా లేదా అన్న విషయాన్ని వెనిగర్ సులభంగా గుర్తిస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా వెనిగర్ కలపాలి. అనంతరం అందులో తేనె వేయాలి. ఆ మిశ్రమంలో నురుగు మొదలవుతుంది. అలా వస్తే ఆ తేనె నకిలీదని గుర్తించాలి. నురుగు రాకపోతే ఆ తేనె ఒరిజినల్ అనే విషయాన్ని గ్రహించాలి.
2. స్వచ్ఛమైన తేనెను నీటిలో కలిపితే పూర్తిగా అందులో కరిగేందుకు టైం పడుతుంది. అలా కాకుండా మీరు కొన్న తేనె వెంటనే నీటిలో పూర్తిగా కలిస్తే దాన్ని నకిలీ తేనెగా గుర్తించాలి. అదేవిధంగా నీటిలో కలిపినప్పుడు తెల్లని మిశ్రమం గనక కనిపిస్తే అప్పుడు కూడా తేనెలో కల్తీ జరిగిందని తెలుసుకోవాలి.
3. తేనెలో ఒక అగ్గిపుల్ల లేదా కాటన్ బడ్‌ను ముంచి వెలిగించాలి. మంట వస్తే ఆ తేనె అసలుదని తెలుసుకోవాలి. అలా కాకుండా కాలిపోతే అది నకిలీ తేనె అని గుర్తించాలి.