పూర్వకాలంలో పుట్టగొడుగులు [మష్రూమ్స్] వర్షాకాలంలోనే లభించేవి. కాని ఇప్పుడు కృత్రిమంగా వీటిని పెంచుతున్నారు. అన్ని సూపర్ మార్కేట్ లలోను ఇవి లభిస్తున్నాయి. అందరు ఇష్టపడే ఈ మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. వీటితో జీడిపప్పు చేర్చి ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నం, చపాతి ల్లోకి బాగుంటుంది.
కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, జీడిపప్పు పది, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటా 1, పచ్చి మిర్చి 1, అల్లం, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఆవాలు ¼ స్పూన్, జీలకర్ర ½ స్పూన్, నూనె సరిపడా, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు, కారం, పసుపు తగినంత.
తయారీ విధానం: జీడిపప్పును పావు గంట పాటు నానపెట్టాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అది వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి టమాటా ముక్కలు వేసి వేయించాలి. తరువాత పసుపు, కారం, గరం మసాలా, కరివేపాకు వేసి మరొక 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మష్రూమ్స్, జీడిపప్పు, సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిని సన్ననిమంటపై ఉడికించాలి. కావాలనుకుంటే నిమ్మరసం పిండుకోవచ్చు. మష్రూమ్స్ పూర్తిగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి అంతే మష్రూమ్స, జీడిపప్పు ఫ్రై రెడీ.
మష్రూమ్స్, జీడిపప్పు ఫ్రై లో పోషక విలువలు: కేలరీస్ 50 g, కార్బోహైడ్రేట్స్ 7g, ఫైబర్ 3g, ప్రోటిన్స్ 10g, ఫాట్స్ 0, విటమిన్ డి 33%, సెలీనియం 16%, ఫాస్ఫరస్ 12%, ఫోలేట్ 4% .