ప్రస్తుత సమాజంలో డబ్బు అవసరం అందరికీ ఉంది. ఐతే అది ఎంత అంటే మాత్రం ఎవ్వరి దగ్గరా సమాధానం ఉండదు. కోటి రూపాయలు సంపాదించాలనుకున్న వారు అది సంపాదించిన తర్వాత మరో కోటి కోసం ఆరాటపడుతుంటారు. ఎంత సంపాదించినా ఇంకా కావాలని అనిపిస్తూనే ఉంటుంది. ఐతే ఎంత సంపాదించినా ఖర్చు చేయకపోతే డబ్బుకి ఏ విలువా లేనట్టే. బీరువాలో డబ్బుల కట్టలు ఊరికే పడి ఉంటే లాభం లేదు. దాన్ని ఖర్చు పెట్టడం కూడా తెలిసిరావాలి.
ఐతే తెలివైన వారు ఎలా ఖర్చు పెడతారు. ఖర్చు చేసే ముందు ఏ విషయాలని పరిగణలోకి తీసుకుంటారో ఈ రోజు తెలుసుకుందాం.
ముందుగా తన ఆర్థిక పరిస్థితి ఏంటనేది తెలుసుకుంటాడు.
ఎంత సంపాదిస్తున్నాను, ఎంత ఖర్చు పెడుతున్నాను అనేది ఓ లెక్క ఉంచుకుంటాడు. తనకి ఆనందం ఇవ్వని ఏ ఖర్చూ అతడు చేయడు. ఒకరికి డబ్బులు ఇచ్చినా అది తన ఆనందం కోసమే అయి ఉంటుంది. వాటిని వసూలు చేయడానికి వెనకాడడు. ఒక వేళ అవి వద్దనుకున్నా వాటి గురించి బాధపడడు.
రూపాయి ఖర్చు పెడుతున్నప్పుడు అది మీకు ఏ విధంగా లాభాన్ని చేకూరుస్తుందో ఆలోచిస్తాడు. అతడు పెట్టే ఖర్చు వల్ల ఎలాంటి ప్రయోజం లేదనుకుంటే కఠినంగా ఉంటాడు.
క్రెడిట్ కార్డు వాడుతున్నా, ఎంత వరకు ఖర్చు చేయాలో ముందే తెలుసుకుంటాడు. అంతకు మించి ఖర్చు చేస్తే భవిష్యత్తులో కష్టాలు పడాల్సి వస్తుందని అతనికి తెలుసు.
ఎదుటి వారిని ఇంప్రెస్ చేయాలని ఖర్చు చేయడు. వేసుకునే బట్టల దగ్గర నుండి కాళ్లకి తొడుక్కునే చెప్పుల వరకు తనకి బాగనిపిస్తేనే ఖర్చు పెడతాడు. అవతలి వాళ్ళని ఇంప్రెస్ చేయాలని అతిగా ఖర్చు చేయడు.
ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేయడం నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదించవచ్చని, ఆ తర్వాత ఎక్కువగా ఖర్చు చేయవచ్చని తెలుసుకుంటాడు.