హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. హిమయత్ నగర్, బషీర్ బాగ్, ఆబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, నారాయణగూడ,సైఫాబాద్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి తదితర ఏరియాలలో కుండ పోత కురుస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్ లో వాన దంచికొడుతోంది. వరద నీటితో నాలాలు పొంగిపొర్లుతున్నాయ్. పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. కుండపోత వర్షంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక ఇప్పటికే వచ్చే 12 గంటల పాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. 3 గంటలుగా ఎడ తెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో దాదాపుగా హైదరాబాద్ లో ఉన్న అన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. నగరంలోని పలు రోడ్ల మీద చేరిన వరద నీరు చెరువును తలపిస్తోంది. వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల 9 నుంచి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.