హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం దాదాపు గంటసేపు భారీ వర్షం దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. వర్షం కురుస్తున్నంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోవడం.. ఆ తర్వాత ఒక్కసారిగా వాహనాలన్నీ బయటకు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల వేగం తగ్గడం కూడా ట్రాఫ్ సమస్యకు కారణమైంది.
ప్రధానంగా పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, సికింద్రాబాద్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వాహనదారులు గంట సేపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. భాగ్యలత, పనామా, హయత్‌నగర్‌లో రోడ్లపై భారీగా వర్షపునీరు చేరడంతో ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది.
నేరెడ్‌మెట్‌లో 9.5 సెం.మీ, ఆనందబగ్‌లో 7.3, మల్కాజ్‌గిరిలో 6.7, తిరుమలగిరిలో 6.3, హయత్ నగర్‌లో 6.2, కుషాయిగూడలో 5.9, భగత్‌సింగ్‌నగర్‌లో 5.5 సెం.మీ వర్షం నమోదైంది. మూసారంబాగ్ బ్రిడ్జి, చాదర్‌ఘాట్ చిన్న వంతెనపై నుంచి రాకపోకలు పునరుద్ధరించారు.