అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే అరెస్టు కానున్నారా. అంటే అవుననే వినిపిస్తోంది. ప్రపంచం ఊహినట్టుగానే ట్రంప్‌పై స్థానిక కోర్టు నేరాభియోగాలు మోపింది. అగ్రరాజ్య అధ్యక్ష చరిత్రలో నేర అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు చెల్లింపుల కేసులో మాన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ.. ట్రంప్‌పై అభియోగాలను మోపింది. 2006 సమయంలో ట్రంప్.. కొందరు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని.. అధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు వాటి గురించి బయటకు చెప్పకూడదని 2016లో ఆ మహిళలకు డబ్బులు ఇచ్చారని అధికారులు ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో స్టామీ డేనియల్స్ అనే శృంగార తారతో పాటు, ట్రంప్ న్యాయవాది, మాజీ సలహాదారులను జ్యూరీ ప్రశ్నిస్తోంది. ట్రంప్ ఆదేశాల ప్రకారం శృంగార తారతో పాటు, ఓ మోడల్‌కు 2.8 లక్షల డాలర్లు ఇచ్చానని ఆయన న్యాయవాది ఒప్పుకున్నారు. అయితే, ట్రంప్ మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. వారిని అసలు తాను కలవలేదని.. 2024 ఎన్నికల్లో రిపబ్లికన్లను దెబ్బతీసేందుకు డెమొక్రాట్లు చేస్తున్న కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు.