హుజూరాబాద్ ఉపపోరులో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికి మంత్రి హరీష్ రావు ( Harish Rao ) బాగానే కష్టపడుతున్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతని తీసుకున్న హరీష్…అన్నీ రకాలుగా ఈటలని దెబ్బకొట్టడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరుపున ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అలాగే కులాల వారీగా ఈటలని దెబ్బతీయడానికి కూడా చూస్తూనే ఉన్నారు. అలాగే ఈటలని ఓడించడానికి బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని టీఆర్ఎస్ అభ్యర్ధిగా పెట్టారు.
harish rao | హరీష్ రావు
ఇదే సమయంలో హరీష్, హుజూరాబాద్ పోరులో సరికొత్త స్ట్రాటజీతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఆ స్ట్రాటజీ ఏంటంటే….హరీష్, ఈటల కంటే బీజేపీని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీల మధ్య ఫైట్ జరుగుతుందని పదే పదే చెబుతున్నారు. ఇలా హరీష్, బీజేపీని హైలైట్ చేయడానికి కారణాలు లేకపోలేదు. హుజూరాబాద్‌లో బీజేపీకి అసలు బలం లేదు. ఇప్పుడు ఈటల తన సొంత బలంతోనే ముందుకెళుతున్నారు.
పైగా కేంద్రంలో బీజేపీ పాలనని హరీష్ సాకుగా చూపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్ల పెంపుపై మాట్లాడుతున్నారు. ఈటల గెలిస్తే నిధులు తీసుకురాలేరని మాట్లాడుతున్నారు. ఇలా హరీష్, బీజేపీని ప్రస్తావించడం వల్ల హుజూరాబాద్ ప్రజలు ఈటలని వదిలేసి బీజేపీపై నెగిటివ్‌తో, టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఓట్లు వేస్తారని హరీష్ ప్లాన్‌గా తెలుస్తోంది. అదే ప్రజలు ఈటలని చూస్తే టీఆర్ఎస్‌కే ఇబ్బంది.
అందుకే హరీష్ పదే పదే బీజేపీని తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు పోరు ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా జరుగుతుంటే, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా పోరుని మార్చడానికి చూస్తున్నారు. కానీ హరీష్ స్ట్రాటజీ పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే హుజూరాబాద్ ప్రజలు కేవలం ఈటలనే చూస్తున్నట్లు తెలుస్తోంది.