దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌కు చెందిన ఓ కార్డియాలజీ సర్జన్ అరుదైన ఘనత సాధించారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న ఓ పేషెంట్‌కు కార్డియాక్ సర్జన్ డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ ఆపరేషన్ చేసి విజయవంతం అయ్యారు. 63 ఏళ్ల వృద్ధుడికి ఆయన కరోనరీ బైపాస్ సర్జరీ చేసి సక్సెస్ సాధించారు.
హైదరాబాద్‌లోని కార్వాన్‌కు చెందిన అఫ్సర్ ఖాన్ అనే వృద్ధుడు కోవిడ్ బారిన పడి గాంధీ హాస్పిటల్‌లో ఏప్రిల్‌లో 21 రోజుల పాటు చికిత్స పొందాక కోలుకున్నాడు. అయితే అతనికి అంతకు ముందు నుంచే గుండె సమస్య ఉంది. కోవిడ్ వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఎక్కువై అది గుండెపై ప్రభావం చూపించింది. దీంతో అతనికి సమస్య మరింత తీవ్రతరమైంది. ఈ క్రమంలో అతనికి కేర్ హాస్పిటల్‌లో చికిత్స అందించారు.
కేర్ హాస్పిటల్‌లోని చీఫ్ కార్డియాక్ సర్జన్, కార్డియాక్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ అఫ్సర్ ఖాన్‌కు బైపాస్ సర్జరీ చేసి సక్సెస్ అయ్యారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో వారు ప్రెస్ మీట్ పెట్టి వివరాలను వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఓ కోవిడ్ రికవరీ పేషెంట్‌కు ఈ విధంగా గుండె సర్జరీ చేసినందుకు డాక్టర్ ప్రతీక్ గుర్తింపు సాధించారు.