లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్న హైదరాబాద్‌ పోలీసులు.. ఈ సారి మరింత కఠినంగానే..?

తెలంగాణలో గత 10 రోజులకు పైగానే నిత్యం భారీగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే దాదాపుగా 90 శాతం కేసులు వస్తున్నాయి. దీంతో తెలంగాణ సర్కారు అలర్ట్‌ అయింది. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఈ విషయంపై మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఇక వైద్య నిపుణులు కూడా హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్‌కు చెప్పారు. దీంతో కేసీఆర్‌ ఈ విషయంపై మరో 3, 4 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్‌ సమావేశంలో చర్చించి హైదరాబాద్‌ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే లాక్‌డౌన్‌ విధించడం అనివార్యం అని తెలుస్తుండడంతో హైదరాబాద్‌ పోలీసులు ఇందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

hyderabad police getting ready for lock down this time more strict

కరోనా కేసులు ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వస్తుండడంతో నగరంలో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు నగర పోలీసులు సమాయాత్తం అవుతున్నారట. గతంలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు పోలీసులు కఠినంగానే ఉన్నా.. ఈసారి మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయవచ్చని తెలుస్తోంది. ఇందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. అయితే సీఎం కేసీఆర్‌ నిర్ణయం కోసం ప్రస్తుతం పోలీసులు వేచి చూస్తున్నారు. ఆయన ఓకే అనగానే పోలీసులు రంగంలోకి దిగుతారు.

ఇక ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతుండడం కలవరపెడుతోంది. దీంతో హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ తప్పనిసరి అని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై మరో మూడు నాలుగు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.