కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్ కనిపెట్టిన హైదరాబాదీ ప్రొఫెసర్!

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టే వ్యాకిన్‌ను కనిపెట్టడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సీమా మిశ్రా ఓ అడుగు ముందకేసినట్టుగా తెలుస్తోంది. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాకిన్‌ను ఆమె కనిపెట్టారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సదరు యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

దీనికి ఆమె ‘టీ-సెల్ ఎపిటోప్స్’ అని నామకరణం చేశారు. అంతకుముందు సీమా వైరస్‌కు సంబంధించిన స్ట్రక్చర్, నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ఉపయోగపడే ఫార్ములాను కంప్యూటర్ సాయంతో కనుగొన్నట్టుగా తెలుస్తోంది. వైరస్ సోకిన వ్యక్తి శరీరంలో చెడిపోయిన కణాలను అంతం చేయడంలో తాము సృష్టించిన ఈ ఎపిటోప్స్ సమర్ధవంతంగా పని చేశాయని సీమా తెలిపారు. ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్న ఈ ఎపిటోప్, మానవ శరీరంలో ఆరోగ్యవంతంగా ఉన్న కణాలకు ఎటువంటి హాని కలిగించదని పేర్కొన్నారు.

సాధారణ పరిస్థితుల్లో ఓ వాక్సిన్ ను కనుగొనేందుకు ఏడాదిన్నర సమయం పడుతుందని సీమా అన్నారు. అయితే శక్తిమంతమైన కంప్యుటేషనల్ టూల్స్ సహాయంతో దీనికి తాము 10 రోజుల్లోనే ఓ రూపు తెచ్చినట్టు వివరించారు. ఇండియాలోని శాస్త్ర సాంకేతిక నిపుణులకు తమ ప్రయోగ ఫలితాల వివరాలను పరిశీలించాల్సిందిగా కోరామని చెప్పారు. ఇప్పుడే కరోనా వైరస్‌‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టుగా భావించరాదని ఆమె కోరారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తని అడ్డుకోవడానికి సామాజిక దూరం పాటించాలని సూచించారు. అయితే సీమా కనుగొన్న వ్యాక్సిన్ కరోనా వైరస్‌కు అరికట్ట వేయగలదా లేదా అనేది పూర్తి స్థాయి పరిశోధనల్లో తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version