హైదరాబాద్ నగరంలోని బుద్ధ భవన్ సెకండ్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కొత్త హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ IPS సీఎంకు స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లోని వసతులను సమీక్షించడంతో పాటు, హైడ్రా విభాగానికి కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అందులో 55 స్కార్పియోలు, 21 ట్రక్కులు, 4 ఇన్నోవాలు, అనేక ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఇవి హైడ్రా పరిధిలో భద్రతా సేవలను మరింత సమర్థవంతంగా చేయడంలో ఉపయోగపడనున్నాయి.
ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ IPS మాట్లాడుతూ, గత 9 నెలలుగా హైడ్రా ప్రజలకు చేరువైన సేవలు అందిస్తూ, ఇరిగేషన్, రెవిన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయానికి కేంద్రబిందువుగా మారిందని పేర్కొన్నారు. సీఎం ఆకాంక్షల ప్రకారం హైడ్రా వ్యవస్థ ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగుతోందని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు, ఆస్తి రక్షణ, ల్యాండ్ గ్రాబింగ్, ఫోర్జరీ, చీటింగ్ వంటి అంశాలపై సమర్థవంతంగా స్పందించేందుకు హైడ్రా స్టేషన్ కీలకంగా మారుతుందని ఆయన వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ప్రజల నమ్మకాన్ని అందుకుంటూ హైడ్రా మరింత ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.