నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో గురువారం జరగనున్న విచారణకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి రేపు సోనియాగాంధీ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యల దృష్ట్యా ఇప్పట్లో విచారణకు హాజరు కాలేనని సోనియాగాంధీ ఈడికి లేఖ రాశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా సోనియాగాంధీ ఇటీవల తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం నుంచి కోలుకున్న అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే వైద్యులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని సోనియాగాంధీకి సూచించారు. వైద్యుల సూచన మేరకు సోనియాగాంధీ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణకు హాజరు కాలేనని, విచారణను మరి కొన్ని వారాల పాటు వాయిదా వేయాలని సోనియాగాంధీ లేఖ రాశారు.