ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీ తీరు పట్ల తమకు ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ జాబితాలోకి పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబు కూడా వస్తారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో వార్తలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఏమైందో ఏమో తెలియదు.. కానీ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు బాబు. ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ వెంటే ఉంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కొడుకు ఇంట్లో తన తండ్రిని ఏ విధంగా అడుగుతాడో తాను అదేవిధంగా అడిగానని.. అయితే ఈ విషయాన్ని మీడియా వక్రీకరించి దుస్ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం సీఎం వైఎస్ జగన్.. తండ్రి లాంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, నన్ను గెలిపించిన పూతల పట్టు నియోజకవర్గ ప్రజలే అని పేర్కొన్నారు. చివరి శ్వాస ఉన్నంత వరకు వైసీపీ కోసమే పని చేస్తానని.. నన్ను పార్టీ నుంచి బయటికి పంపేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.