దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయిన విషయం తెలిసిందే. టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్రావు రంగంలోకి దిగి దుబ్బాక ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికలపై ఇటీవలే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే హరీష్ రావు మంత్రి పదవి పోవడంతో పాటు ఎమ్మెల్యే సీటు కూడా ఉండదని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇటీవలె దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లన్నసాగర్ గ్రామాలకు తప్పక న్యాయం చేస్తాము అంటూ తెలిపారు.