అక్క‌డ రూ. 1000కి బట్టలు కొంటే.. కిలో ఉల్లి ఫ్రీ..

ప్రస్తుతం ఉల్లికి ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఉల్లిపై తెగ జోకులు షికారు చేస్తుండడమే కాకుండా.. పెళ్లిళ్లకు ఈ అత్యంత నిత్యావసర సరకును బహుమతిగా అందించిన ఘటనలు అనేకం ఇటీవల జరిగాయి. అయితే వ్యాపారాన్ని పెంచుకునేందుకు మహారాష్ట్రకు చెందిన ఓ దుస్తుల వ్యాపారి బంపరాఫర్ ను ప్రకటించాడు. తన వద్ద రూ. 1000కి దుస్తులు కొనుగోలు చేస్తే, కిలో ఉల్లిపాయలను ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. ఉల్లాస్ నగర్ లోని శీతల్ హ్యాండ్ లూమ్స్ యజమాని ఈ ఆఫర్ ను పెట్టాడు. “ఉల్లిపాయల ధర కిలోకు రూ. 130కి చేరుకుంది.

ఇవాళ కూడా ధర పెరిగింది. దీంతో రూ. 1000కి దుస్తులు కొనుగోలు చేస్తే, ఉల్లిపాయలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. ఎంతో మంది ఈ ఆఫర్ ను ఇష్టపడుతున్నారు” అని షాపు యజమాని వ్యాఖ్యానించారు. కాగా, గత సంవత్సరం ఇదే సమయంలో రూ. 20 వరకూ ఉన్న కిలో ధర, ఇప్పుడు రూ. 100ను దాటేసిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయిస్తున్నా, అవి ప్రజల అవసరాలను అరకొరగానే తీరుస్తున్నాయి.