చికిత్స కోసం వెళ్లితే.. బంగారు గొలుసు మాయం..!

-

చికిత్స కోసమని ఆసుపత్రికి వెళ్తే పేషెంట్ బంగారు గొలుసు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ఆర్ఎల్ నగర్ లో  చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని బాధితురాలు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే చర్లపల్లి లక్ష్మీనగర్ కాలనీలో నివాసముండే జె.ప్రత్యూష (20) అనే మహిళకు ఫిబ్రవరి 10వ తేదీన ఛాతీలో నొప్పి వస్తుందని నాగారం మున్సిపాలిటీ ఆర్ఎల్ నగర్ లోని ఓ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లింది. పరీక్షించిన డాక్టర్ ఈసీజీ తీయాలని తెలిపారు.

ఈసీజీ తీసే సమయంలో మంగళసూత్రం తీయమని చెప్పడంతో తీసి నర్సుకి ఇచ్చింది. ఈసీజీ తీసిన అనంతరం శుభ్రం చేసుకోమని ప్రత్యూషకి టిష్యూ పేపర్ ఇచ్చింది. టిష్యూ పేపర్ తో శుభ్రం చేసుకునే లోపే డాక్టర్ వెళ్లిపోతారు తొందరగా రావాలని పేషెంట్ ను కంగారు పెట్టగా డాక్టర్ దగ్గరకు వెళ్లింది. డాక్టర్ దగ్గరకి వెళ్లగా.. మందులు రాసి తీసుకోమని చెప్పింది. నొప్పితో బాధపడుతున్న ప్రత్యూష కంగారుగా మందులు తీసుకొని ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు మెడలో చూసుకోగా బంగారు గొలుసు కనిపించకపోవడంతో ఆసుపత్రి వద్దకు వచ్చి అడిగితే యాజమాన్యం తమకేం తెలియదంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 45 గ్రాములు తన బంగారు మంగళసూత్రంని ఇప్పించి తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధితురాలు కోరింది. .

Read more RELATED
Recommended to you

Latest news