సాధారణంగా ప్రతి దేవాలయంలో దేవుళ్లను నిత్యం ఆరాధిస్తుంటాం. వారి దర్శనాలను చేసుకుంటాం. కానీ దేశంలో కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి కోవకే చెందిన దేవుడు..
40 ఏళ్ళకు ఒకసారి దర్శనమిచ్చే కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్తి విశేషాలు.. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందింది. సుమారు 1000 కి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. దక్షిణాపథంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం (కంచి). కంచిలోగల ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్యతిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజ స్వామి దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే త్వరగా గుర్తువస్తుంది. ఈ ఆలయ౦లోని విశేషం శ్రీ అత్తి వరదరాజ స్వామి.
పురాణ కాలంలో చతుర్ముఖ బ్రహ్మ గారు దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మచే అత్తి చెట్టు కాండంతో శ్రీవరదరాజ స్వామి (వరములను ద అనగా ఇచ్చునట్టి శ్రీ నారాయణుని) విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు.ఈ మూర్తికి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో తురుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తున్న సమయంలో శ్రీవారి మూర్తికి హాని కలుగకుండా వుండేందుకై ఆలయంలోని ఆనంద పుష్కరిణిలో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం అడుగు భాగంలో ఉంచారట. లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట. తదనంత కాలంలో అంతా పరిస్థితి సర్దుకున్నాక కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్య మూర్తి ని ప్రతిష్టించారు.. అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపర్చబడిన శ్రీ అత్తి వరదరాజ స్వామిని 40 సంవత్సరాలకు ఒకసారి బయటకు తీసి వసంత మంటపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979 లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ఈ సంవత్సరం అంటే 2019 జులై 1 వ తేదీ నుంచి ఆగస్ట్ 17 వరకు తిరిగి దర్శనం ఇవ్వనున్నారు. మొదటి 38 రోజులు శయన(పడుకున్న) భంగిమ లోను చివరి 10 రోజులు స్థానక(నిలుచున్న)భంగిమలో దర్శనం ఇస్తారు. ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయల టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 నుంచి 12 వరకు సాయంత్రం 7 నుంచి 8 వరకు రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది.
పుష్కరిణి
అత్తి వరదర్‌ను భూమిలోపల దాచే సమయంలో ఏర్పడ్డ గుంత అత్తి వరదర్‌ను భూమిలోపల దాచే సమయంలో ఏర్పడ్డ గుంత పుష్కరిణిగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది. పురాణాలు మాత్రం యాగ గుండం నుంచి అత్తివరదర్ పుట్టినట్లు చెబుతున్నాయి. చివరిగా అత్తివరదర్‌ను 1979లో అనంత సరస్సును నుంచి బయటకు తీసుకొచ్చారు. తిరిగి స్వామిదర్శనం 2059లో జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకు నలభై ఏండ్లకు ఒక్కసారి దర్శనమిచ్చే వరాలు ఇచ్చే స్వామిని దర్శనం చేసుకుని తరించండి.
– కేశవ