మాఘమాసం విశిష్టత మీకు తెలుసా ?

-

తెలుగు మాసాలలో ఒక్కోమాసానికి ఒక్కో ప్రత్యేకత. అయితే మాఘం అంటే చాలు చాలా మందికి పెండ్లిళ్లు, శుభముహూర్తాలు, మహాశివరాత్రి గుర్తుకు వస్తుంది. శూన్యమాసం అంటే పుష్యం పోయి శుభ సమయం వచ్చిన సమయం ఇది. ఉత్తరాయణంలో మొదటి శుభకార్యాలు జరిగే నెల ఇది.

చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది. ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.

మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హర తృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు. శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమిగా నిర్వహిస్తారు. అక్షరాభాస్యాలకు ప్రత్యేంగా ఈ తిథి పేరుగాంచింది. రతికామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు. శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి.

రథసప్తమి

శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది. చాలా ప్రాంతాలలో ఈ రోజు ఇంటిముందర పొయ్యిపెట్టి పాయసాన్ని వండి సూర్యుడికి నైవైద్యేం సమర్పిస్తారు, అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం. నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు. దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు. ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వ కర్మ జయంతిగా పేరు పొందింది. మాఘపూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.

Are you not getting married.. follow these tips to get married easily

మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు. కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పండితులు పేర్కొంటున్నారు.

ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళ నుండి ఎంతో విశిష్టత ఉంది. మాఘమాసంలో శుభముహూర్తాలు కూడా బాగానే ఉన్నాయి. వాటితో ఈ నెల అంతా పెళ్లిళ్ల సందడి, గృహప్రవేశాలతో హడావుడిగా ఉంటుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news