ఏపీ, తెలంగాణలో పెట్రో ధ‌ర‌లు త‌గ్గుతాయా..? ప‌న్నుసెగ‌లో ఎవ‌రి వాద‌నేంటి?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ త‌న 21వ ఆవిర్భావ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తుండ‌గా.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు. కోవిడ్ తీవ్ర‌త‌, దానిని ఎదుర్కోవ‌డంలో భాగంగా ఈ స‌మావేశం నిర్వ‌హించినా..పెట్రోల్ ఉత్ప‌త్తుల‌పై ప‌లు రాష్ట్రాలువిధిస్తున్న వ్యాట్ విష‌యంలో ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ప్రతిపక్షపార్టీలు అధికారంలో ఉన్న మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ తో పాటు మ‌రో రెండు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించ‌నందువ‌ల్లే అక్క‌డ‌ ధ‌ర‌లు అధికంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

ప్ర‌ధాని సూచ‌న నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాలు ఘాటుగానే స్పందించాయి. అస‌లు పెట్రో ఉత్ప‌త్తుల‌పై ఎవ‌రి ప‌న్ను ఎంత‌? అంటూ లెక్క‌లు వెల్ల‌డిస్తున్నాయి. కేంద్రం అధికంగా విధిస్తోందా? మా రాష్ట్రం అధికంగా విధిస్తోందా? అంటూ ఎదురుదాడికి దిగుతున్నాయి.

ప్ర‌ధాని మోడీ సూచ‌న‌పై తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర‌స్థాయిలో స్పందించారు. “టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏనాడు పెట్రో ఉత్పత్తులపై పన్నుపెంచలేదు. 8 ఏళ్లుగా వ్యాట్ పెంచ‌లేదు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నసెస్ కారణంగానే ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఈ సెస్ వ‌ల్ల రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 41శాతం వాటా దక్కడం లేదు. సెస్ రూపంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11.4 శాతాన్ని లూటీ చేస్తోంది. కేంద్రం సెస్ రద్దు చేస్తే దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ప్రైస్ అమలు చేయొచ్చు. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ.70, డీజిల్ రూ.60కు దిగి వస్తుంది” అని ట్వీట్ చేశారు.

“రాజ‌కీయ అజెండాలో భాగంగానే ప్ర‌ధాని మోడీ ఇలా అన్నారు. కొవిడ్ మీటింగ్ లో పెట్రో ధ‌ర‌ల ప్ర‌స్తావ‌న ఎందుకు చేశారు? మేం పెంచుకుంటూ పోతాం.. మీరు మాత్రం త‌గ్గించండి అని అంటున్నారు. మేం మా రాష్ట్రంలో ఇప్ప‌టికీ వ్యాట్ పెంచ‌లేదు. త‌గ్గించ‌లేదు. కానీ ధ‌ర‌లు మాత్రం పెరుగుతున్నాయి. దీనికి కార‌ణం ఎవ‌రు? అని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మమ‌తా బెన‌ర్జీ సెటైర్లు వేశారు.

“పెట్రో ధ‌ర‌లు త‌గ్గాలంటే కేంద్రం సెస్సుల విధింపును త‌గ్గించాలి. లేదంటే సెస్సుల‌ను వ్యాట్ గా మార్చాలి. సెస్సుల మొత్తమంతా కేంద్రానికి వెళ్తోంది. దాంట్లోనూ మాకు వాటా ఇస్తే.. మా అభివృద్ధికి ఉప‌యోగించుకుంటాం. అప్పుడు మేం వ్యాట్ త‌గ్గిస్తాం.” అని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.

ఇక మహారాష్ట్ర స‌ర్కారు అయితే.. పెట్రోల్ పై ఎవ‌రెంత ప‌న్ను విధిస్తున్నార‌ని గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించింది. “ముంబైలో లీట‌ర్ డీజిల్ పై విధిస్తున్న ప‌న్నుల్లో కేంద్రం వాటా రూ. 24.38. మా రాష్ట్ర వాటా రూ.22.37. అంటే కేంద్రం కంటే మేం విధించే ప‌న్ను రూ.2 త‌క్కువ‌. ఇక పెట్రోల్ పై విధిస్తున్న ప‌న్నుల్లో కేంద్రం వాటా రూ.31.58.. మా ప‌న్ను మొత్తం రూ.32.55. అంటే కేంద్రం కంటే ఒక రూపాయి ఎక్కువ‌. రెండు రూపాయ‌ల త‌క్కువ‌తో.. ఒక రూపాయి ఎక్కువ‌తోనే పెట్రో ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతాయా? స‌మ‌స్య ఎక్క‌డ ఉందో గుర్తించి చ‌ర్య‌లు తీసుకుంటే మంచిది? ” అని ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇక ఏపీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కైతే అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

నిజంగా రాష్ట్రాలు వ్యాట్ పెంచాయా..?

స‌రే.. కేంద్రం చెబుతున్న‌ట్లుగా నిజంగానే ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాట్ పెంచాయా? అంటే ఏ రాష్ట్రంలోనూ ఇటీవ‌ల వ్యాట్ పెంచిన ప్ర‌క‌ట‌న‌లు లేవు. పార్ల‌మెంట్ లో కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..తెలంగాణలో గత ఏడాది జూలై 1న పెట్రోల్‌పై రూ. 20.87, డీజిల్‌పై రూ. 16.26 చొప్పున రాష్ట్ర పన్నులు ఉన్నాయి. అదే కేంద్రం ప్ర‌భుత్వం విధించే ప‌న్న‌లు డీజిల్‌పై రూ.31.83కు, పెట్రోలుపై రూ.32.98గా ఉన్నాయి.

నిజానికి..పెట్రోల్ ఉత్ప‌త్తుల‌పై కేంద్రం విధించే పన్నులేదా సెస్ వ‌ల్ల చ‌మురు ధ‌ర‌లు పెరుగుతాయి.పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా ఆటోమేటిక్ గా రాష్ట్రాల వ్యాట్ కూడా వ‌ర్తిస్తుంది. దాంతో వాటి ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రాలకు చమురుపై పన్ను ఆదాయం పెరిగిందంటే దానికి కారణం కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడమే. కేంద్రం ప‌న్నులు, సెస్సు త‌గ్గిస్తే..ఆటోమేటిక్ గా వ్యాట్ కూడా త‌గ్గుతుంది.

ఇదే విష‌యాన్ని రాష్ట్రాలు ప్ర‌స్తావిస్తున్నాయి. పైగా.. పెట్రోల్ పై కేంద్రం ప‌న్నులు గాకుండా సెస్సులు విధించ‌డంతో ఆ మొత్తం కేంద్ర ఖ‌జానాలోకే పోతోంద‌ని ఆరోపిస్తున్నాయి. ఇలా సెస్సుల రూపంలో గ‌త ఏడేళ్ల‌లో కేంద్రం ఖ‌జానాలోకి రూ.24 ల‌క్ష‌ల కోట్లు చేరాయ‌ని, అందులో త‌మ‌కు ఒక్క పైసా కూడా రాలేద‌ని పేర్కొంటున్నాయి.

ప్ర‌ధాని మోడీ సూచ‌న‌పై ఆయా రాష్ట్రాలు స్పందిస్తున్న తీరును చూస్తుంటే.. అక్క‌డ‌ వ్యాట్ త‌గ్గించే సూచ‌న‌లే లేశ‌మాత్రంగా కూడా క‌నిపించ‌డం లేదు. పెట్రో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని అనుకోవ‌డం పెద్ద ఆశే అవుతుందేమో..! వాస్త‌వానికి..పెట్రో ధ‌ర‌ల అంశాన్ని రాజ‌కీయంగా వాడుకుని ల‌బ్ధి పొందాల‌నే యావ త‌ప్ప ప్ర‌జ‌ల‌పై భారం త‌ప్పిద్దామ‌నే ఆలోచ‌న అటు కేంద్రం.. ఇటు రాష్ట్రాలకు లేక‌పోవ‌డ‌మే శోచ‌నీయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version