టీసీఎస్‌లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. టీడీఎస్ క్లెయిమ్స్‌లో వ్యత్యాసాల కారణంగా ఈ నోటీసులు అందినట్లు సమాచారం.ఓ మీడియా కథనం ప్రకారం.. 30వేల నుంచి 40వేల మంది ఉద్యోగులు ఈ నోటీసులు అందుకున్నట్లు సమాచారం. కంపెనీలో సీనియారిటీని బట్టి రూ.50వేల నుంచి రూ.1లక్ష వరకు పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రిఫండ్లు సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ లోపం వల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో TDS క్లెయిమ్‌లు సరిగ్గా అప్‌డేట్ కానందున ఈ సమస్య ఉత్పన్నమైందని నివేదించబడింది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం సెప్టెంబర్ 9న పంపబడిన ఈ నోటీసుల్లో FY-24 మార్చి త్రైమాసికానికి ఉద్యోగులు చేసిన పూర్తి చెల్లింపులకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని ఐటీ శాఖ పేర్కొంది. దీంతో ఉద్యోగులు 2024-25 అసెస్‌మెంట్ ఏడాదికి టాక్స్ నోటీసులు అందుకున్నారు. దీనిపై స్పందించిన TCS యాజమాన్యం, తదుపరి సూచనలు అందించే వరకు ఉద్యోగులు ఎలాంటి చెల్లింపులు చేయవద్దని, పన్ను అధికారులకు ఈ సమస్యను తెలియజేసి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఉద్యోగులకు అంతర్గతంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.