దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. కానీ టీకాల కొరత వల్ల 18-44 ఏళ్ల వయస్సు వారికి టీకాలను ఇవ్వడం లేదు. కేవలం రెండో డోసు టీకాలను మాత్రమే ప్రస్తుతం అందిస్తున్నారు. ఇక టీకాలను సేకరించుకునే బాధ్యతను కేంద్రం రాష్ట్రాలకు అప్పగించింది. దీంతో రాష్ట్రాలు టీకాల కోసం ఇబ్బందులు పడుతున్నాయి. అయితే దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండు టీకాలను ఇస్తుండగా, కోవిషీల్డ్ మొదటి, రెండో డోసుకు మధ్య వ్యవధిని మరింత పెంచాలని నిపుణుల బృందం సూచించింది.
కోవిషీల్డ్ రెండు డోసులకు ప్రస్తుతం 4 నుంచి 8 వారాల వ్యవధి ఇస్తున్నారు. అయితే దీన్ని 12 నుంచి 16 వారాలకు పెంచాలని నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) సూచించింది. కానీ కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచాలని మాత్రం వారు చెప్పలేదు. కేవలం కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిని మాత్రమే పెంచాలని చెప్పారు.
ఇక కరోనా నుంచి కోలుకున్న వారు టీకాల కోసం 6 నెలల వరకు వేచి చూడాలని నిపుణులు సూచించారు. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ల సూచన మేరకు టీకాలను తీసుకోవచ్చని సూచించారు. కాగా దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను మాత్రమే ఇస్తుండగా త్వరలో రష్యాకు చెందిన స్పుత్‌నిక్ టీకాను కూడా పంపిణీ చేయనున్నారు.