ఇది నిజం! కనికట్టు కాదు.. కట్టుకథా కాదు!! అక్షరాలా నిజం!! తాజాగా ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. బహుశ ఈ మధ్య కాలంలో ఇంత రేంజ్‌లోనెటిజన్లు ఓ నాయకుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించడం ఇదే తొలిసారి అంటున్నారు సోషల్ మీడియా ఫాలోవర్లు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయంపై మేధావులు సైతం దృష్టి పెట్టారు. విషయంలోకి వెళ్తే.. తాజాగా సీఎం జగన్ విజయనగరంలోని అయోధ్య మైదానంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగనన్న వసతి దీవెన అనే సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అయితే, ఈ సందర్భంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించిన జగన్.. అనూహ్యంగా తాను మాట్లాడ వలసిన సబ్జెక్టు నుంచి పక్కకు తప్పుకొన్నారు. వాస్తవానికి గత సీఎం చంద్రబాబును తీసుకుంటే.. ఆయన ఏ వేదికెక్కినా.. కూడా గత , వర్తమాన, భవిష్యత్ అంశాలను, ప్రతిపక్షాల రగడను కూడా తెరమీదికి తెచ్చి గంటలకొద్దీ ప్రసంగించే అలవాటు ఉంది. అలాంటి చంద్రబాబు తో పోలిస్తే.. జగన్ చాలా డిఫరెంట్ గురూ అనే రేంజ్‌లోనే జగన్ ప్రసంగాలు ఉంటాయి.
ఆయన ఎంచుకున్న సబ్జెక్టుకు ఆయన కట్టుబడతారు. ఒక్క మాట కూడా తూలరు. ఏర్పాటు చేసిన కార్యక్రమం ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని ఆ కార్యక్రమంలో ఏ విషయం మాట్లాడాలో అంత వరకు మాత్రమే ఆయన మాట్లాడి, అది కూడా సభికులకు బోర్ కొట్టకుండా మాట్లాడి అక్కడి నుంచి తప్పుకొంటారు. దీంతో జగన్ ప్రసంగాలకు సాధారణంగా నే ఫాలోయింగ్ ఎక్కువ. అనే క సందర్భాల్లో వీక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.
అదేంటి రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాలు ఓ రేంజ్‌లో ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. జగన్ తన ప్రసంగంలో ఒక్క మాట కూడా వాటిని ప్రస్థావించలేదని మేధావులు కూడా అనుకున్నారు. అయితే, దీనికి భిన్నంగా విజయనగరం సభలో జగన్ వ్యవహరించారు. తాను జగనన్న వసతి దీవెన కార్యక్రమం ప్రారంభించిన వెంటనే అనూహ్యంగా ఆయన ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ‘పేదల సంక్షేమం కోసం శ్రమిస్తున్న మా ప్రభుత్వంపై కొందరు నిత్యం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుపేదలకి రికార్డు స్థాయిలో ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంటే కొన్ని పత్రికలు, మీడియాల తప్పుడు ప్రచారాన్ని ఏమనాలి. చంద్రబాబును ప్రజలు మరిచిపోతారనే భయంతోనే ఆ పత్రికలు, ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
ఏ తప్పు చేయకపోయినా రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోంది` అని చెప్పారు. అంటే ప్రతిపక్షాలను రాక్షసులతోను, ఉన్మాదులతోను జగన్‌తొలిసారి పోలుస్తూ.. ఓ బహిరంగ సభలో అందునా సీఎం హోదాలో విమర్శించడం ఇదే తొలిసారి. దీంతో విమర్శలు మరింత పెరుగుతాయేమోనని ఓవర్గం వైసీపీ నాయకులు భావించారు. కానీ, దీనికి భిన్నంగా నెటిజన్ల నుంచి మంచి మద్దతు లభించడం గమనార్హం. అంతేకాదు.. ప్రతిపక్షాలను రాక్షసులు కన్నా ఇంకేమైనా పదం వాడితే బెటరేమో..అనే సూచనలు కూడా రావడం కొసమెరుపు!!