సికింద్రాబాద్ జింఖానా మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన ఆఫ్‌లైన్ టికెట్ల విక్రయాలు పూర్తయినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వాహకులు వెల్లడించారు. అయితే, ఆన్‌లైన్ టికెట్లు ఈరోజు రాత్రి 7 తర్వాత అందుబాటులో ఉంచుతామన్నారు. ఈనెల 25న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.
మ్యాచ్ వీక్షించడం కోసం టికెట్ల కొనుగోలుకు అంచనాలకు మించి క్రికెట్ అభిమానులు జింఖానా మైదనానికి వచ్చారు. భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి స్పందించారు.
తెలంగాణ వచ్చాక జరగనున్న రెండో మ్యాచ్ ఇది అని, కరోనా తర్వాత జరిగే మ్యాచ్ అయినందున డిమాండ్ ఎక్కువగా ఉందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది జరగకూడదన్నదే అందరి ఉద్దేశమన్నారు. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పెద్ద ఈవెంట్ కనుక చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని అన్నారు.