యూపీ ఎలెక్షన్స్: అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ!

-

ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ దించనున్నట్లు తెలుస్తున్నది. మతపరంగా సున్నితమైన అయోధ్య నుంచి యోగి పోటీ చేయడంపై సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆమోదం తెలుపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రాజకీయంగా కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు దశలలో పోలింగ్ జరగనుండగా తొలి దశ ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్నది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనున్నది.

మంగళవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశమై ఉత్తర్‌‌ప్రదేశ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెక్టార్ల వారీగా రివ్యూ నిర్వహించడంతోపాటు క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై రీజియనల్ ఇన్‌చార్జుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

కోర్ కమిటీ సమావేశంలో అయోధ్య నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసే అవకాశంపై ప్రస్తావనకు వచ్చింది.

ప్రస్తుతం సీఎం యోగి ఆదిత్యనాథ్ శాసన మండలిలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధం ఉన్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news