భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. గురువారం రాత్రి పాకిస్థాన్ అనేక నగరాలపై సడెన్ క్షిపణి దాడికి పాల్పడింది. జమ్మూ, జైసల్మేర్, పఠాన్‌కోట్ సహా పలు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి యత్నించింది. అయితే భారత వైమానిక రక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా స్పందించి, పాక్ క్షిపణులను గాల్లోనే నిలిపేసింది. అధునాతన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ సహాయంతో ఈ దాడిని భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా, దాడికి ఉపయోగించిన పాకిస్థాన్ కు చెందిన మూడు యుద్ధ విమానాన్ని కూల్చివేయడం విశేషం. పాక్ దాడి జరిగిన వెంటనే జమ్మూ, షాపూర్, మాధోపూర్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, జైసల్మేర్ ప్రాంతాల్లో అలర్ట్ సైరన్లు మోగాయి. ప్రజలు భయంతో ఇళ్లకు పరుగులు తీశారు. జాగ్రత్త చర్యగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
జమ్మూ యూనివర్సిటీ సమీపంలో రెండు పాక్ డ్రోన్లను భారత యుద్ధవిమానాలు కూల్చివేశాయి. అలాగే, ఆర్ఎస్ పురా, అర్నియా, సాంబా ప్రాంతాల్లో డ్రోన్ దాడులను యాంటీ-డ్రోన్ వ్యవస్థల ద్వారా అడ్డుకున్నాయి. ఈ దాడులకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ఎక్స్ యూజర్ “మా ఇళ్ల పైనే క్షిపణులు ఎగురుతున్నాయి” అంటూ షేర్ చేసిన వీడియోలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. జమ్మూ ప్రాంతంలో పాకిస్థాన్ F-16 జెట్‌ను కూల్చివేయడంలో భారత్ తన అత్యాధునిక రక్షణ శక్తిని మరోసారి ప్రపంచానికి చూపించింది. ఇలాంటి చర్యల నేపథ్యంలో భారతదేశం సెక్యూరిటీ వ్యవస్థ ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపితమైంది.