కరోనా నేపథ్యంలో ఈ ఏడాది క్రికెట్‌ను అంతగా ఎంజాయ్ చేయలేని ఫ్యాన్స్‌కు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను ఇండియాలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ ఇప్పటికే రద్దు కాగా.. వచ్చే ఏడాది ఈ టోర్నీని ఐసీసీ భారత్‌లో నిర్వహించనుంది. ఈ మేరకు ఐసీసీ ప్రకటించింది.
కాగా ఈ ఏడాది రద్దు అయిన టీ20 వరల్డ్‌కప్‌ను 2022లో ఆస్ట్రేలియాలో నిర్వహిస్తారు. అక్టోబర్ – నవంబర్ నెలల్లో ఆ టోర్నీ జరుగుతుంది. ఇక 2023లో భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. గతంలో 2011లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో కలిసి భారత్ సంయుక్తంగా టోర్నీని నిర్వహించింది. కానీ ఈసారి భారత్‌లోనే టోర్నీ జరుగుతుంది.
కాగా టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ విషయమై ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ బోర్డులు, ఐసీసీ చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే టెస్టు చాంపియన్‌షిప్‌పై ఐసీసీ ఇంకా స్పష్టతనివ్వలేదు. షెడ్యూల్ ప్రకారం ఆ టోర్నీ జూన్ 2021లో జరగాల్సి ఉంది.
భవిష్యత్తులో జరగనున్న ఐసీసీ టోర్నమెంట్ల వివరాలు…
* 2021లో టీ20 వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది.
* 2022లో టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది.
* 2023లో వన్డే వరల్డ్‌కప్ ఇండియాలో జరుగుతుంది.