ఆస్ట్రేలియా గడ్డ పై టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీ సేన ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం వృథా అయింది. అతనికి తోడుగా మరో బ్యాట్స్‌మెన్ ఎవరు రాణించకపోవడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. మరోవైపు సమష్టిగా రాణించిన ఆసీస్ ఈ విజయంతో క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది.
187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు కేఎల్ రాహుల్ డకౌట్ తో ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసిన కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దినా శిఖర్ ధావన్ 28 పరుగులు చేసి ఔటవ్వడంతో ఈ జోడికి తెరపడింది.ఆ తర్వాత వచ్చైం బ్యాట్స్ మెన్ ఎవరు రాణించకపోవడం గత మ్యాచ్ హీరో హార్దిక పాండ్య కూడా 20 పరుగులు చేసి ఔటవ్వడంతో భారం మొత్తం విరాట్ పై పడింది.రన్ రేట్ పెరుగుతుండటంతో భారీ షాట్ కి ప్రయత్నించి 85 పరుగుల వద్ద ఔటయ్యాడు.దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులే చేసింది.