మహారాష్ట్రలో ప్రస్తుత అసెంబ్లీ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఏ క్షణమైనా శుభవార్త వినవచ్చన్న ఆశతో బీజేపీ నాయకులు ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన గత నెల 24వ తేదీ నుంచి శివసేన, బీజేపీ మధ్య చర్చలు ఏ మాత్రం కొలిక్కి రావడం లేదు. శివసేన మంత్రి పదవులతో పాటు సీఎం పదవిని కూడా 50 – 50 రేషియాలో పంచుకోవాలని ముందు నుంచి డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.
ఇరు పార్టీల మధ్య చర్చలు ఎంత మాత్రం కొలిక్కి రాకపోవడంతో ఇప్పటకీ ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో బుధవారం మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, శివసేనకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో మొట్టమొదటి సారిగా శివసేన మంత్రులు ఆపద్ధర్మ సీఎం దేవేంద్ర ఫడణ్‌వీస్‌తో భేటీ అయ్యారు. మహారాష్ట్ర రైతాంగం సంక్షోభంపై చర్చించడానికి శివసేనకు చెందిన ఆరుగురు మంత్రులను సీఎం ఫడణ్‌వీస్ ఆహ్వానించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై సైతం ఇరు పార్టీల నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే, రామ్‌దాస్ కదమ్‌తో పాటు మరికొందరు హాజరయ్యారు. శివసేనతో దాదాపు డీల్ కుదిరినట్టే తెలుస్తోంది. శివసేనకు ఏఏ మంత్రిత్వ శాఖలు కేటాయించాలి, సీఎం పదవిపై 50:50 ఫార్ములా పై ఏం చేయాలని బీజేపీ మంత్రులు సీఎం ఫడణ్‌వీస్‌తో చర్చించారు. ఇక విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం ముందుగా బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకోనుంది.. ఇక మంత్రి పదవులు మాత్రం 50: 50 రేషియోలోనే పంచుకోనున్నారు.