టీమిండియా ప్లేయర్లపై పంచ్‌లు.. సోషల్ మీడియా వేదికగా అభిమానుల ఆగ్రహం..!

-

అనుకున్నదంతా అయింది.. మొదటి టెస్టులాగే రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ టీమిండియా దారుణంగా ఓటమి పాలైంది. కనీసం పోరాట పటిమ చూపకుండానే భారత బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్ ఎదుట మోకరిల్లారు. తమ వల్ల కాదుబాబోయ్ అన్నట్లుగా వికెట్లను టపా టపా సమర్పించుకున్నారు. అయితే ఇంగ్లండ్ చేతిలో మొదటి టెస్ట్ కన్నా రెండో టెస్ట్ మ్యాచ్‌లో మరీ ఘోరంగా ఓడిపోవడం పట్ల మాత్రం భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు టీమిండియా ప్లేయర్లతోపాటు కోచ్ రవిశాస్త్రిపైనా సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. వారిపై జోకులు పేలుస్తున్నారు.

ఇంగ్లండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 159 పరుగుల భారీ తేడాతో దారుణ పరాజయం పాలవడం పట్ల భారత అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. రెండో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌట్ అయిన మురళీ విజయ్ స్థానాన్ని నటి అనుష్క శర్మతో భర్తీ చేయాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా, మరికొందరు.. ఒక రోజు మిగిలి ఉండగానే టెస్టు ముగియడంతో అనుష్కను లండన్‌లో షాపింగ్‌కు తీసుకువెళ్లేందుకు కోహ్లికి సమయం దొరికిందని కామెంట్లు చేశారు.

ఒక వేళ భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్ ఎవరినైనా జట్టులోంచి తీసేయాలని భావిస్తే.. ముందుగా కోచ్ రవిశాస్త్రిని తీసేయాలని కొందరు ట్విట్టర్‌లో కామెంట్లు పెట్టారు. ఇంత దారుణంగా ఓడిపోవడం జుగుప్సాకరంగా ఉందని, 2014 ఇంగ్లండ్ పర్యటనలో ఎదురైన పరాభవం కంటే ఇది మరీ దారుణంగా ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌లో ఉన్న భారత జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ టీం ప్రదర్శన ఇలా ఉండడం ఏమీ బాగాలేదని కొందరు వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ కామెంట్ల పట్ల అటు బీసీసీఐ గానీ, ఇటు ప్లేయర్లు గానీ స్పందించలేదు. మరి మూడో టెస్టులోనైనా అంచనాలకు తగినట్టుగా ప్రదర్శన చేస్తారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news