ఇజ్రాయెల్‌లో భారతీయుడు క్షేమంగానే ఉన్నారు : కేంద్రం

-

ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని భారత్ సమర్థిస్తుందని తెలిపింది. అయితే.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర దాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. హమాస్ దాడుల్లో మరణించినవారిలో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్ లో భారతీయుల భద్రత పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్రం స్పందించింది. ఇజ్రాయెల్ లో భారతీయులెవరూ మరణించలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ అజయ్ ప్రారంభించామని, ఇప్పటివరకు భారతీయులు మృతి చెందినట్టు తమకు వార్తలు అందలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి తెలిపారు.

ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు మొదటి చార్టర్డ్ విమానం ఈ రాత్రి టెల్ అవీవ్ చేరుకుంటుందని, ఆ విమానం ద్వారా 230 మంది స్వదేశానికి వస్తారని భావిస్తున్నామని పేర్కొన్నారు. తరలింపు కార్యక్రమాల కోసం భారత వాయుసేన సేవలతో సహా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని వివరించారు. “ప్రస్తుతం ఇక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఇది ఆందోళన కలిగించే అంశం. సుమారు 18 వేల మంది భారతీయులు ఇజ్రాయెల్ లో ఉన్నారు. ఇజ్రాయెల్ లోని భారత దౌత్య కార్యాలయం నుంచి వచ్చే సలహాలు, మార్గదర్శకాలను భారత పౌరులు తప్పక పాటించాలి” అని బాగ్చి తెలిపారు.

ఇక, సంక్షుభిత వెస్ట్ బ్యాంక్ లో ఓ డజను మంది, గాజాలో ముగ్గురు నలుగురు భారతీయులు ఉండొచ్చని… వారిని కాపాడాలంటూ విజ్ఞప్తులు అందుతున్నాయని పేర్కొన్నారు. హమాస్ మిలిటెంట్ల దాడులను భారత్ టెర్రరిస్టు దాడులుగానే పరిగణిస్తుందని స్పష్టం చేశారు. చర్చల ద్వారానే సంక్షోభాన్ని నివారించాలని భారత్ పిలుపునిస్తోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version