దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదో రోజును దుర్గాష్టమిగా పిలుచుకుంటారు. ఆశ్వయుజ అష్టమిని దుర్గాష్టమిగా జరుపుకుంటాం. ఈ క్రమంలోనే గురువారం అమ్మవారు శ్రీ దుర్గా దేవిగా భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యారు.అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షస సంహారం చేసిన సందర్భంగా దుర్గాష్టమిని జరుపుకుంటాం. శివుని శక్తి రూపమే “దుర్గ” అని ఆదిశంకరాచార్యులు తెలిపారు.
దుర్గాదేవిని రాత్రి సమయాల్లో పూజిస్తే సర్వపాపాలు నాశనమౌతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని వ్యాస మహర్షి రచించిన మత్స్యపురాణం పేర్కొంది. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారిని దర్శించుకుంటే గ్రహ బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కాగా, కనకదుర్గ ఆలయంలో భారీగా భక్తులు ఉండటంతో దర్శనానికి చాలా టైం పడుతోందని సమాచారం.