లక్ష్మీ.. సర్వజగత్తూ లక్ష్మీ స్వరూపం. ప్రతీదానిలో ఆ తల్లి ఉంటుంది. లక్ష్మీ అంటే కేవలం ధనం, బంగారమేకాదు సమస్త ప్రపంచం అమ్మ స్వరూపమే.. చాలామందికి వ్యక్తిగతంగా మనకి డబ్బు పట్ల వ్యామోమం లేకపోవచ్చు. విలాసంగా జీవించాలన్న ఆశ లేకపోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో జీవించాలంటే డబ్బుతోనే పని. మరి ఆ డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే. అందుకోసం శాస్త్రాలు కొన్ని తంత్రాలను, పరిహరాలను సూచిస్తుంది వాటిని భక్తితో, విశ్వాసంతో ఆచరిస్తే తప్పక మీకు మంచి జరుగుతుంది.
తామరపూలు
లక్ష్మీదేవి సముద్ర మథనంలో ఆవిర్భవించింది. అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామరగింజలతో పూజిస్తే మంచిదని అంటారు. లక్ష్మీదేవిని తామరపూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందన్నది అనుభవజ్ఞుల మాట. తామరపూలను నేతిలో ముంచి హోమంలో వేసినా, లక్ష్మీదేవి విగ్రహాన్ని తామరపూలతో పూజించినా శుభప్రదం.
నేతిదీపాలు
చీకటిని అజ్ఞానానికీ, దారిద్ర్యానికీ, నిరాశకీ చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీకటిని పారద్రోలే సాధనం దీపం. ఇక నేతితో చేసిన దీపం పాడిపంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి. పాల నుంచి వెన్నను చిలికినట్లుగా, జీవితమనే మధనంలో తమకు విజయం చేకూరాలన్న కాంక్షను ప్రతిఫలిస్తాయి.
శ్రీఫలం
పేరులోనే ‘శ్రీ’ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి… ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజగదిలో ఉంచుకునేందుకు వీలు ఉంటుంది. ఏల్నాటిశనితో బాధపడుతున్న వారూ, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ, క్యాష్ కౌంటర్లో కానీ ఉంచితే మీరు ఊహించని విజయాలు సొంతమవుతాయని పండితులు పేర్కొంటున్నారు.
శ్రీసూక్తం
అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు రుగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీసూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి, వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడూ మోగుతుండేలా చూసినా శుభప్రదమే.
శ్రీచక్రం
తంత్రవిద్యలో శ్రీచక్రం/ శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తొమ్మిది త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల కలయికకూ, నవనాడులకూ చిహ్నమని చెబుతారు. అంతేకాదు ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికీ ఒకో మహత్తు ఉందని అంటారు. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే ‘మేరు ప్రస్తారం’ అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ, శ్రీయంత్రాన్ని కానీ పూజగదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం. అయితే శ్రీచక్రం ఇంట్లో ఉంచుకుంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పండితుల దగ్గర తెలుసుకుని ఆచరించాలి.
-కేశవ