జగన్ సర్కారు ట్రాక్టర్ల యజమానులకు ఓ శుభవార్త చెప్పింది. నదుల పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలు సొంత అవసారాలకు ఎడ్ల బండి ద్వారా ఇసుక ఉచితంగా తీసుకోడానికి సీఎం జగన్ పర్మీషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో ట్రాక్టర్ యజమానులు కూడా ఉచితంగా ఇసుక తీసుకెళ్ళేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. కానీ వీటికి కొన్ని నిబంధనలు ఉంటాయని కండిషన్ పెట్టింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు చేపడతామని ప్రభుత్వం వెల్లడించింది.
సొంత అవసరాలు, బలహీనవర్గాల గృహ నిర్మాణం, సహాయ పునరావాస ప్యాకేజీలకు ఇసుక ఉచితంగా తీసుకెళ్ళేందుకు జగన్ సర్కార్ అనుమతులు ఇచ్చింది. గతంలో ఎడ్ల బండికి మాత్రమే అనుమతిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ట్రాక్టర్లకు కూడా అనుమతి వర్తిస్తుందని తీపి కబురు చెప్పింది. 1,2,3 ఆర్డర్ రీచ్‌లలో మాత్రమే అనుమతి దక్కుతుందని ప్రభుత్వం తెలిపింది. సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లానుకుంటే గ్రామ, వార్డు సచివాలయాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి కోరిన వారి వివరాలు నమోదు చేసుకుని, ఎలాంటి ఫీజు లేకుండా సచివాలయాలు అనుమతి పత్రం ఇస్తాయి. బలహీన వర్గాల గృహ నిర్మాణం, సహాయ, పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన పనులకు ఉచితంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లేందుకు కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. సొంత అవసరాలకు అని చెప్పి ఇసుక తీసుకెళ్లి ఎక్కడైనా నిల్వ ఉంచడం జరిగినా లేక నియమాలను ఉల్లాఘించి విక్రయిస్తున్నట్టు తెలిసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.